ధోనీ, నేను సేమ్ టు సేమ్: యువీ
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా ధోనీ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని, ఆటగాడిగా జట్టుకు ఎంతో అవసరమని యువీ అన్నాడు. ధోనీకి, తనకు మధ్య ఓ విషయంలో సారూపత్య ఉందని చెప్పాడు. తామిద్దరం భయమన్నదే లేకుండా క్రికెట్ ఆడుతామని, త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో జోరు కొనసాగిస్తామని అన్నాడు.
భారత వన్డే, టి-20 కెప్టెన్గా ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించారు. కాగా ఆటగాడిగా ధోనీ కొనసాగనున్నాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్కు ధోనీతో పాటు యువీని ఎంపిక చేశారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువీ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ధోనీ రిటైర్మెంట్, విరాట్ కెప్టెన్సీ గురించి యువీ జాతీయ మీడియాతో మాట్లాడాడు.
'కెప్టెన్సీ వైదొలగాలని ధోనీ సరైన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియాకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన నిర్ణయమని మహీ భావించి ఉంటాడు. విరాట్‌లో ఈ లక్షణాలు ఉన్నాయని అభిప్రాయపడి ఉంటాడు. కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించగలడని భావిస్తున్నా. కోహ్లీ చిన్న వయసు నుంచి అతన్ని చూస్తున్నా. కెరీర్లో నిలకడగా రాణిస్తూ రోజు రోజుకు రాటుదేలుతున్నాడు. సీనియర్‌గా ధోనీ మద్దతు అతనికి ఉంటుంది. టీమిండియాకు ధోనీ అత్యున్నతమైన కెప్టెన్. అతని సారథ్యంలో 2011 వన్డే ప్రపంచ కప్, 2007 టి-20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాం. టెస్టులో నెంబర్ ర్యాంక్ సాధించాం. ఇన్ని విజయాలు సాధించిన భారత కెప్టెన్ మరొకరు లేరు' అని యువీ అన్నాడు.