'టాప్-4లో యువీని పంపడం కష్టం'
రాంచీ: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు బ్యాటింగ్ అవకాశాలు తక్కువగా వస్తున్నాయని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంగీకరించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో యువీని ముందుగా పంపడం కష్టమని, ఎందుకంటే టాప్-4 బ్యాట్స్మెన్కు అద్భుతమైన రికార్డు ఉందని చెప్పాడు. 'ఓపెనర్లు రోహిత్, ధవన్.. 3, 4 స్థానాల్లో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఉన్నారు. వీరి నలుగురికి టి20ల్లో అసాధారణ రికార్డు ఉంది. కాబట్టి యువీని టాప్-4లో పంపడం చాలా కష్టం. అయితే రాబోయే మ్యాచ్ల్లో యువీకి మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తా' మహీ అన్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన యువీ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన యువీ.. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో ఏడో స్థానంలో ఆడాడు. తొలి మ్యాచ్లో 10 పరుగులు చేయగా, రెండో మ్యాచ్లో డకౌటయ్యాడు. రెండో మ్యాచ్లో యువ ఆటగాడు హార్ధిక్ పాండ్యాను యువీ కంటే బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపడం సత్ఫలితాన్నిచ్చింది. పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన ధోనీసేన సిరీస్ను 1-1తో సమం చేసింది.