యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్
ముంబై: అనుకున్నట్లే జరిగింది. చీలమండ గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రేపు(గురువారం) ముంబైలో వెస్టిండీస్ తో జరగనున్న సెమీఫైనల్స్ మ్యాచ్ కోసం యువరాజ్ స్థానంలో మనీశ్ పాండేను జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు నిర్ధారించారు. నిజానికి యువరాజ్ గాయపడ్డప్పుడే మనీశ్ జట్టులోకి వస్తాడని ఊహించినప్పటికీ బుధవారం సెలెక్టర్ల ప్రకటనతో అది ఖరారయింది.
సెమీస్ లోకి ప్రవేశించేందుకు గత ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగన అమీతుమీ మ్యాచ్ లో పరుగులు తీస్తూ ఒక్కసారిగా కూలబడ్డ యువరాజ్ ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తొలి, మలి టీ20 వరల్డ్ కప్ ల్లో సత్తా చాటినంతగా యువరాజ్ ఈసారి ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడిన అతను.. కేవలం 63 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పాకిస్థాన్ పై సాధించిన 24 పరుగులే అత్యధిక స్కోరు. మూడు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసే అవకాశం రాని యువరాజ్ ఆసీస్ తో జరిగి మ్యాచ్ లో మాత్రం మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు.