
కోల్‌కత్తా : క్రికెటర్ మనోజ్ తివారీపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై అతని భార్య సుస్మితా రాయ్ మండిపడ్డారు. తన భర్తను విఫలమైన క్రికెటర్‌గా పేర్కొనడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. టీమిండియాలో విఫలమైన ఆటగాళ్లు వీళ్లేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. అందులో మనోజ్ తివారీ పేరు కూడా ఉంది. తాజాగా ఈ పోస్ట్‌పై స్పందించిన సుస్మిత అందుకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేశారు. తన భర్త పేరును ఆ జాబితాలో చేర్చడానికి ఎంత ధైర్యం అని ప్రశించారు. ఇటువంటి అర్థం లేని పోస్ట్‌లు క్రియేట్ చేసే ముందు నిజాలు చెక్ చేసుకోవడం మంచిదని హెచ్చరించారు. ఇతరుల గురించి చెడు ప్రచారం చేసే బదులు.. ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలని హితవు పలికారు.
కాగా, 2008లో టీమిండియాలో స్థానం దక్కించుకున్న తివారీ.. తన కేరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం 12 వన్డేలు, 3 టెస్టులు మాత్రమే ఆడారు. మరోవైపు ఐపీఎల్ విషయానికి వస్తే.. 2012లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో తివారీని పంజాబ్ జట్టు దక్కించుకోగా.. 2019లో మాత్రం అతడికి నిరాశే మిగిలింది. ఇక, దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి బెంగాల్ జట్టులో తివారీ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఇటీవల బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంలో తివారీ కీలక భూమిక పోషించారు. 11 మ్యాచ్‌ల్లో 707 పరుగులు సాధించారు. మళ్లీ తిరిగి సత్తా చాటడానికి తివారీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుస్మిత కూడా తన భర్తకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. (చదవండి : ఏది ఏమైనా వదలడు.. కుంబ్లేపై లక్ష్మణ్ ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment