‘ఆసియా’ మేటి మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: భారత హాకీ రైజింగ్ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ జూనియర్ విభాగంలో ఆసియా మేటి క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా హాకీ సమాఖ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల మన్‌ప్రీత్ ఇప్పటివరకు 103 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
మిడ్ ఫీల్డ్ స్థానంలో ఆడే మన్‌ప్రీత్ గతేడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో, మలేసియాలో జరిగిన జోహర్ బారు కప్‌లో భారత్‌కు నేతృత్వం వహించాడు. మన్‌ప్రీత్ సారథ్యంలోనే టీమిండియా జోహర్ బారు కప్‌లో విజేతగా నిలిచింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత సీనియర్ హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్న మన్‌ప్రీత్ ఈ నెలలో జరిగే ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనున్నాడు.