సచిన్‌కు మోదం.. టీమిండియాకు ఖేదం | March 31st In Cricket History: Team India HeartBreak In T20 World Cup | Sakshi
Sakshi News home page

భారత ఆశలపై నీళ్లు చల్లిన ఆ ‘ఇద్దరు’

Mar 31 2020 6:05 PM | Updated on Mar 31 2020 7:55 PM

March 31st In Cricket History: Team India HeartBreak In T20 World Cup - Sakshi

‘జ్ఞాప‌కాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోటే ఉంటాయి..మోయక తప్పదు’అని ఓ సినిమాలో పేర్కొన్నట్టు భారత క్రికెట్‌ జట్టు, అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రెండు సంఘటనలు జరిగినవి ఇదే రోజు(మార్చి 31). ఆ రెండు జ్ఞాపకాల్లో ఒకటి టీమిండియా మనోవేదనకు గురైనది కాగా.. మరొకటి సరికొత్త చరిత్ర లిఖించిన అంశం. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆ రెండు జ్ఞాపకాలను టీమిండియాతో పాటు అభిమానులు తమ గుండెల్లో మోస్తూనే ఉన్నారు. అవేంటో చూద్దాం..

2016, మార్చి 31.. టీమిండియా అభిమానులు కలలో కూడా మర్చిపోలేని రోజు. ధోని చేతిలో టీమిండియా ఖాతాలో మరొక ప్రపంచకప్‌ ఖాయమని అనుకున్న ఆందరి ఆశలపై వెస్టిండీస్‌ నీళ్లు చల్లింది. టీ20 ప్రపంచకప్‌ 2016 సెమీస్‌లో భాగంగా విండీస్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. విరాట్‌ కోహ్లి(89 నాటౌట్‌; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌) వీరతాండవం చేయగా.. రోహిత్‌ శర్మ (43), అజింక్యా రహానే (40) రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 19 పరుగులకే క్రిస్‌ గేల్‌(5), శాముల్స్‌(8) వికెట్లను చేజార్చుకుంది. 

మూడు ఓవర్లు ముగిసే సరికే విండీస్‌ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో విండీస్‌ గెలుపు అంత ఈజీ కాదని అందరూ అనుకున్నారు. కానీ పొట్టి క్రికెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కరేబియన్‌ ఆటగాళ్లు ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు. తొలుత చార్లెస్‌ (52; 36 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి మిగతా ఆటగాళ్లకు బూస్టప్‌ ఇచ్చాడు. అనంతరం సిమ్మన్స్‌ (82 నాటౌట్‌; 51 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే విండీస్‌ విజయానికి 36 బంతుల్లో 73 పరుగులు చేయాల్సిన సమయంలో గెలుపు అవకాశాలు సమంగానే నిలిచాయి. కానీ సిమ్మన్స్‌ సహాయంతో అండ్రీ రసెల్‌ (43 నాటౌట్‌, 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. మరో రెండు బంతులు మిగిలుండగానే విండీస్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన కోహ్లి ఒక వికెట్‌ దక్కించుకోవడం విశేషం.  ఇక ఫైనల్‌కు చేరుకున్న విండీస్‌ అందరి అంచనాలను తలకిందులు చేసి ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. 

తొలి క్రికెటర్‌గా సచిన్‌..
2001, మార్చి31.. అంతర్జాతీయ, టీమిండియా వన్డే క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు. టీమిండియా గాడ్‌, లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డును సృష్టించాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ ఈ మార్క్‌ అందుకున్నాడు. ఆ తర్వాత 13 మంది క్రికెటర్లు పదివేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా పదివేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్‌(259 ఇన్నింగ్స్‌ల్లో) ఇప్పటికీ కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో సారథి విరాట్‌ కోహ్లి(205 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్న విషయం తెలిసిందే.

చదవండి:
వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?
రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement