మారుతి ఆల్‌రౌండ్ మెరుపులు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో ఆల్ సెయింట్స్, గౌతమ్ మోడల్ స్కూల్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. సెయింట్ ఆండ్రూస్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో మారుతి రెడ్డి ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆల్ సెయింట్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ 132 పరుగులకే ఆలౌటైంది. ఒక్క సిద్ధార్థ్ నాయుడు (45) మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
ఆల్ సెయింట్స్ బౌలర్లలో మారుతి 3 వికెట్లు తీయగా, సయ్యద్ ఆసిఫ్ 2, హితేశ్ ఒక వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆల్ సెయింట్స్ హైస్కూల్ రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా వచ్చిన మారుతి (59 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. ఆదిశ్ 28, మధుకుమార్ 21 పరుగులు చేశారు. రెండో సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బాయ్స్ టౌన్ జట్టు 9 వికెట్లకు 101 పరుగులు చేసింది. గౌతమ్ మోడల్ స్కూల్ బౌలర్ వరుణ్ గౌడ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గౌతమ్ మోడల్ స్కూల్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. వికాస్ 46, వరుణ్ 38 (నాటౌట్) పరుగులు చేశారు.