
కల చెదిరింది
మేరీకోమ్ ‘రియో’ ఆశలు ఆవిరి!
అస్తానా (కజకిస్థాన్): వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలని ఆశించిన భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్‌కు నిరాశ ఎదురైంది. ‘రియో’కు చివరి అర్హత టోర్నమెంట్ అయిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన 51 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 0-2తో అజిజి నిమాని (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఈ పోటీల్లో సెమీఫైనల్ చేరుకున్న వారికి మాత్రమే ‘రియో’ బెర్త్ ఖాయమవుతుంది.
ఈ ఓటమితో ‘రియో’లో పాల్గొనే అవకాశం మేరీకోమ్ చేతుల్లో లేకుండా పోయింది. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఇప్పటికే ‘రియో’కు అర్హత సాధించిన రెన్ కాన్‌కాన్ (చైనా), లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ) గనుక ఈ పోటీల్లో పతకాలు సాధిస్తేనే మేరీకోమ్‌కు ఒలింపిక్స్‌లో బరిలో దిగే ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు 60 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన లైష్రామ్ సరితా దేవి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. సరిత 0-3తో విక్టోరియా టోరెస్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్ అర్హత అవకాశాలను కోల్పోయింది.