
బిగ్ ఫైట్ ప్రారంభం
లాస్‌వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’కు తెర లేచింది. మహా బలుల యుద్ధం మొదలైంది. ‘రింగ్’లో కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి పోటీకి దిగారు.
వెల్టర్ వెయిట్ కేటగిరీ (63.5 కేజీల నుంచి 67 కేజీల వరకు)లో జరిగే ఈ బౌట్‌లో మూడు నిమిషాల నిడివిగల 12 రౌండ్లు ఉంటాయి. నిర్ణీత 12 రౌండ్లలోపు ఎవరైనా నాకౌట్ అయితే బౌట్ అక్కడే ముగుస్తుంది. ఒకవేళ బౌట్ పూర్తిగా 12 రౌండ్లు జరిగితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. మొత్తానికి 45 నిమిషాల పాటు పోరు సాగే అవకాశముంది.
విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ముందే కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ ఖాతాలోకి... 40 శాతం పాకియో ఖాతాలోకి వెళ్తుంది.