
పాకియోను పడగొట్టిన మేవెదర్
లాస్‌వేగాస్: మహా యుద్ధంలో ఫ్లాయిడ్ మేవెదర్ గెలుపొందాడు. ఫిలిప్పీన్స్ బాక్సర్ మ్యానీ పాకియో పోరాడి ఓడాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ ‘శతాబ్దపు పోరు’లో అమెరికా మహాబలుడు మేవెదర్ విజయకేతనం ఎగురవేశాడు. ప్రత్యర్థి పాకియోను పడగొట్టి టైటిల్ కైవశం చేసుకున్నాడు. న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా మేవెదర్ ను విజేతగా ప్రకటించారు. మేవెదర్ కు 1500 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.
12 రౌండ్ల పాటు జరిగిన మహాపోరులో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఇద్దరు యోధులు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన 'రింగ్' ఫైట్ లో బాక్సలిద్దరూ పంచ్ లతో విరుచుకుపడ్డారు. అనుకున్న సమయానికి కంటే గంట సేపు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 'రింగ్'లో పాకియో చురుగ్గా కదిలినట్టు కనిపించాడు. మేవెదర్ మాత్రం ఆచితూచి ఆడాడు. పాకియో ఎటాకింగ్ చేయగా, మేవెదర్ ఆత్మరక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరి రెండు రౌండ్లులో మేవెదర్ దూకుడు పెంచాడు. పాకియోపై ఎటాక్ చేసి అతడిని ఆత్మరక్షణలో పడేశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత న్యాయనిర్ణేతలు మేవెదర్ ను విజేతగా ప్రకటిస్తూ ఏకగ్రీవ నిర్ణయం వెలువరించారు. తన కెరీర్‌లో పోటీపడిన 48 బౌట్‌లలోనూ గెలిచి తన అజేయ రికార్డు మెరుగుపరుచుకున్నాడు. మరో బౌట్ గెలిస్తే అమెరికా దిగ్గజ బాక్సర్ రాకీ మార్సియానో రికార్డు 49-0ను చేరుకుంటాడు.
ఈ బౌట్ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం మేవెదర్ కు... 40 శాతం పాకియో కు చెల్లిస్తారు. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ బౌట్ ద్వారా రూ. 2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ బౌట్‌కు రిఫరీగా కెన్నీ బేలిస్ వ్యవహరించారు. ఆయనకు 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలు) ఫీజు ఇస్తారు. బాక్సింగ్‌లో ఓ రిఫరీకి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం.