
రూ. 1900 కోట్ల 'ఫైట్'
దాదాపు ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి. ఐదేళ్ల నిరీక్షణకు కొన్ని గంటల్లోనే తెరలేవబోతోంది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత 'రిచ్చెస్ట్ గేమ్'గా పరిగణిస్తున్న రింగ్ ఫైట్‌కు నగరంలోని 'ఎంజీఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనా' వేదిక కాబోతోంది. స్టేడియంలోని మొత్తం 16,800 సీట్లకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. 1900 కోట్ల రూపాయల బాక్సింగ్ పోరాటానికి అంతా సిద్ధమైంది. ఇక జూలు విదిలించి కొదమ సింహాల్లా రింగులోకి దూకడానికి జగద్విఖ్యాత బాక్సింగ్ చాంపియన్లు ఫ్లాయిడ్ మేవెథర్ జూనియర్, మన్నీ పేక్వియావో సిద్ధంగా ఉన్నారు.
అమెరికాకు చెందిన 38 ఏళ్ల మేవెథర్ ఓటమి ఎరుగని వీరుడు. 14 సార్లు బాక్సింగ్‌లో ఛాంపియన్‌షిప్ సాధించారు. ఇక ఫిలిప్పీన్స్‌కు చెందిన 36 ఏళ్ల మన్నీ పేక్వియావో కూడా 2007 వరకు ఓటమి ఎరుగని వీరుడే. అందుకే ఆ రోజునే వీరిద్దరి మధ్య ఫైట్‌కు నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. వీరు ఎన్నడూ ముఖాముఖి ఫైట్ చేయలేదు. అందుకే నేడు ప్రపంచంలోని కోట్లాది మంది బాక్సింగ్ అభిమానులు అ క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. మేవెథర్ డిఫెన్స్‌లో దిట్ట, శరీరానికి పెద్ద గాయం తగలకుండా ఆత్మరక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇక పేక్వియావోకు ఎదురుదాడిలో ఎదురు లేదు. అందుకనే ఆయనను ప్యాక్‌మేన్ అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పుడు వీరిద్దరి పోరాటం ఎలా ఉంటుందన్న అంశంపై బాక్సింగ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. పోరాటం పట్టు తప్పి చప్పగా సాగితే బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు కుప్పకూలుతాయని, ఉత్కంఠతో ప్రేక్షకుల నరాలు తెంపే తీరులో సాగితే భవిష్యత్ బాటంతా బంగారమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
-1900 కోట్ల రూపాయల ఈ ఛాంపియన్‌షిప్‌లో విజేతకు ఖరీదైన మూడువేల పచ్చలు (ఎమెరాల్డ్స్) పొదిగిన పట్టాతో సత్కరిస్తారు. 1147 కోట్ల రూపాయలను అందజేస్తారు.
-పరాజితుడికి 765 కోట్ల రూపాయలు అందజేస్తారు.
-టిక్కెట్ల రూపంలో నిర్వాహకులకు ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయలు వచ్చాయి. టీవీ రైట్స ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి. వాటి వివరాలు వెల్లడి కాలేదు.
-2007లో జరిగిన ఓ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించినట్టు అంచనా వేశారు. ఈసారి 30 కోట్లకు పైగానే వీక్షిస్తారని అంచనా.