ఫైల్ ఫోటో
లండన్: ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ బాంటన్ రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడటం కంటే ప్రస్తుతం కౌంటీ చాంపియన్ షిప్‌లో ఆడటమే బెటర్ అని ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ‘టీ20ల్లో బాంటన్ సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఆ ఫార్మట్‌లో అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టులో ఆరో స్థానం నాణ్యమైన బ్యాట్స్‌మన్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో బాంటన్ కౌంటీల్లో తన సత్తా నిరూపించుకుని టెస్టు జట్టులోకి వచ్చే సువర్ణావకాశం ముందుంది.
అతడు ఇప్పుడే ఐపీఎల్‌లో ఆడటం అవసరం లేదు. ఇంకొంత కాలం ఆగితేనే బెటర్. ఐపీఎల్ కంటే కౌంటీ చాంపియన్ షిప్‌లో సోమర్ సెట్ తరుపున ఆడితే అతడి కెరీర్‌కు ఎంతో లాభం చేకూరుతుంది. అవసరమైతే ఐపీఎల్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నా పర్వాలేదు. కౌంటీల్లో ఆడటం వల్ల ఆటగాడిగా బాంటన్ మరింత పరిణితి చెందుతాడు. టెస్టు ఆడినప్పుడు పరిపూర్ణమైన ఆట బయటకు వస్తుంది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అతడే. మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి’ అని వాన్ పేర్కొన్నాడు. ఇక గతేడాది డిసెంబర్‌లో ఐపీఎల్-2020 కోసం జరిగిన వేలంలో టామ్ బాంటన్‌ను కనీస ధర రూ. కోటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడుతున్న ఈ క్రికెటర్ సిక్సర్ల వర్షం కురిపిస్తుండటంతో కేకేఆర్ అభిమానులు ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment