వరుసగా ఐదు సిక్సర్లు.. ఆనందంలో కేకేఆర్‌ | IPL 2020: KKR Happy With Tom Banton Performance In BBL | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదు సిక్సర్లు.. ఆనందంలో కేకేఆర్‌

Published Tue, Jan 7 2020 1:04 PM | Last Updated on Tue, Jan 7 2020 1:04 PM

IPL 2020: KKR Happy With Tom Banton Performance In BBL - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) ఆనందంతో మురిసిపోతుంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 కోసం జరిగిన వేలంలో తాము చేజిక్కించుకున్న ఆటగాడు అదరగొట్టడమే దీనికి కారణం. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ టామ్‌ బాంటన్‌ను ఐపీఎల్‌లో కనీస ధర రూ. కోటికి కేకేఆర్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆటగాడు బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌ హీట్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంటన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 

కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.  ముఖ్యంగా సిడ్నీ ఆటగాడు అర్జున్‌ నాయర్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో బాంటన్‌ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా బాంటన్‌ ఓకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన వీడియోను బీబీఎల్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘సిడ్నీలో బాంటన్‌ కొట్టిన సిక్సర్ల సౌండ్‌ కోల్‌కతాలో వినపడుతోంది’, ‘క్రిస్‌ లిన్‌ లేకున్నా బాంటన్‌ ఉన్నాడుగా’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇది కేకేఆర్‌కు అమితానందం కలిగించేదే అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.  

ఇక బ్రిస్బేన్‌-సిడ్నీల మధ్య జరిగిన మ్యాచ్‌కు వరణుడు పలుమార్లు అడ్డంకిగా నిలిచాడు. వర్షం కారణంగా తొలుత మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బాంటన్‌(19 బంతుల్లో 56; 2ఫోర్లు, 7 సిక్సర్లు)కు తోడు క్రిస్‌ లిన్‌(31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉన్న క్రమంలో వర్షం మరోసారి రావడంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం బ్రిస్బేన్‌ 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement