
హైదరాబాద్:
ఇటీవలికాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో సినీ తారలు, క్రీడాకారిణిలు శ్రుతి మించుతున్నారంటూ నెటిజన్లలో ఓ వర్గం విరుచుకుపడుతోంది. భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అటు మైదానంలో ఇటు బయటా ఎంతో కూల్‌గా ఉంటారు. ఒత్తిడి సమయాల్లోను సంయమనం కోల్పోరు. కానీ, ఆటల్లోనైనా వ్యక్తిగతంగానైనా తన జోలికి వస్తే మాటలతో కాకుండా చేతలతోనే బదులిస్తారు. ఇదే విషయాన్ని మిథాలీ మరోసారి రుజువు చేశారు. ఇటీవల మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఓ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా తీసిన ఫోటో షూట్‌కు సంబందించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
#tb #PostShootSelfie #funtimes #girlstakeover pic.twitter.com/p5LSXLYwmA
— Mithali Raj (@M_Raj03) September 6, 2017
అసలు ఏం జరిగింది..
సెప్టెంబర్ 5న స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను మిథాలీ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా ఉన్నానంటూ.. తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఆమె అప్పుడు వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లలో ఓ వర్గం మండిపడింది. మహిళలకు ఒక రోల్ మోడల్‌గా భావిస్తున్న సమయంలో ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడమేమిటని నెటిజన్స్ మిథాలీని హేళన చేశారు. దీనికి మాటలతోకాకుండా చేతలతో లేటెస్ట్ ఫోటో షూట్‌తో మిథాలీ బదులిచ్చారని ఆమెకు మద్దతుగా నిలిచిన నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.
What a momentous day today was, standing with these special women!!@MabenMaben @AlNooshin @vedakmurthy08 pic.twitter.com/EsNwRN2G7N
— Mithali Raj (@M_Raj03) August 20, 2017
గతంలోనూ నెటిజన్లకు మిథాలీ చురకలు
ఆగష్టు 20న బెంగళూరులో మిథాలీ ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు మమతా మాబెన్, నూషిన్ అల్ ఖాదిర్, వేదా కృష్ణమూర్తితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు అందరి నుంచి సానుకూల స్పందన రాగా ఒకరు మాత్రం.. చెమటతో ఎబ్బెట్టుగా కనబడుతున్నావు అని ఆ ఫొటోను ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశాడు. ఇందుకు మిథాలీ ‘నేను మైదానంలో చమటోడిస్తే కానీ ఈ స్థాయికి రాలేదు. దీనికి నేను సిగ్గు పడడంలేదు. ఈ అకాడమీ ప్రారంభించడానికి కూడా నేను గ్రౌండ్‌లోనే ఉన్నా’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. అంతే..ఇక అతడు మళ్లీ నోరు మెదపలేదు. మిథాలీ స్పందించిన తీరును ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు.
కాగా, ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టుని ముందుండి నడిపించి అందరి మనసును దోచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మహిళల కేటగిరీలో భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ క్రికెటర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు. బౌలింగ్ విభాగంలో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి నిలకడగా రెండో స్థానంలోనే ఉంది.
గుత్తా జ్వాలా కూడా..
క్రీడాకారుల వస్త్రధారణ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని లెక్క చేయబోనని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ద్వేషించేవాళ్లు ద్వేషించినా కానీ, ముందు నన్నో సెల్ఫీ దిగనివ్వండి అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ట్రోలర్స్(సోషల్ మీడియాలో కామెంట్లలో విరుచుకుపడేవారు) గురించి పట్టించుకోకండి. పాజిటివిటీ, ప్రేమని పంచండి అంటూ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు.
సెప్టెంబర్ 22న గుత్తా జ్వాలా పోస్ట్ చేసిన ఫోటో
Comments
Please login to add a commentAdd a comment