
కరాచీ: ఈ ఏడాది జూన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను పాకిస్తాన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తో జరిగిన తుది పోరులో పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ సేన 158 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో పాకిస్తాన్ టైటిల్ ను సునాయాసంగా చేజిక్కించుకుంది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ జరిగిన దాదాపు ఐదు నెలల తరువాత కోహ్లి అవుట్ చేయడానికి రచించిన 'బాల్ ప్లాన్ ' ను పాకిస్తాన్ స్పీడ్ స్టార్ మొహ్మద్ ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడో ఓవర్ నాల్గో బంతికి కోహ్లిని ఓ చక్కటి వ్యూహంతో పెవిలియన్ కు పంపినట్లు ఆమిర్ తెలిపాడు. కాగా, అదే ఓవర్ మూడో బంతికి విరాట్ ఇచ్చిన క్యాచ్ ను అజహర్ అలీ వదిలేయడంతో తదుపరి బంతిని కూడా అదే తరహాలో వేసి సక్సెస్ అయినట్లు ఆమిర్ పేర్కొన్నాడు.
'విరాట్ ఒక విలువైన ఆటగాడు. ఒక్కసారి అతనికి ఛాన్స్ ఇచ్చేమంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. విరాట్ కోహ్లికి లైఫ్ ఇస్తే ఇక మ్యాచ్ ను వదులుకోవాల్సింది. అతనికి ఎప్పుడు లైఫ్ లభించినా దాన్ని సెంచరీ వరకూ తీసుకెళతాడు. గత మ్యాచ్ ల్లో విరాట్ అదే తరహాలో చేసి చూపించాడు కూడా. దాన్ని నేను దృష్టిలో పెట్టుకున్నా. కోహ్లికి వేసే ప్రతీ బంతిని ఒళ్లు దగ్గర పెట్టుకుని వేయాలనుకున్నా. అయితే కోహ్లికి మేము అప్పటికే ఒక ఛాన్స్ ఇచ్చాం. నా బౌలింగ్ లో కోహ్లి ఒకసారి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అంతముందు నేను సంధించిన బంతి అవుట్ స్వింగర్ కావడంతో ఆపై ఇన్ స్వింగర్ ను ఆడటానికి కోహ్లి సంసిద్ధమవుతాడని తెలుసు. కోహ్లి ఒకటి తలస్తే.. నేను మరో విధంగా ఆలోచించా. అందుకే ఆ మరుసటి బంతిని కూడా ముందు బంతి తరహాలోనే వేయాలనుకున్నా. అక్కడ నా వ్యూహం ఫలించింది. ఆ బంతికి కోహ్లి తడబడ్డాడు. బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో కి వెళ్లింది. ఈసారి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షాదబ్ తప్పిదం చేయలేదు. కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను ఒడిసిపట్టుకున్నాడు. దాంతో కోహ్లి ఆదిలోనే పెవిలియన్ కు వెళ్లడంతో నా లక్ష్యం నెరవేరింది' అని ఆమిర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment