టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.
81 సెంచరీలు
అలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.
మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే
ఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.
కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.
మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా
కాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.
చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
Comments
Please login to add a commentAdd a comment