ప్రపంచంలోని ప్రస్తుత టాప్ బ్యాటర్లలో బాబర్ ఆజం టెక్నిక్ గొప్పగా ఉంటుందని పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ జాహిద్ అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ టెస్టు సెంచరీల ధీరుడు జో రూట్ మాత్రం.. బాబర్ కంటే తెలివిగా బ్యాటింగ్ చేస్తారని అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా స్టార్లలో విరాట్ కోహ్లి కంటే కూడా రోహిత్ శర్మకే తాను ఎక్కువ రేటింగ్ ఇస్తానని జాహిద్ స్పష్టం చేశాడు.
టెక్నిక్ పరంగా బాబర్ వరల్డ్ నంబర్ వన్
ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ నైపుణ్యాల పరంగా చూస్తే.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బాబర్ ఆజం బెస్ట్ అని చెబుతాను. అందరికంటే అతడి బ్యాటింగ్ టెక్నిక్ అత్యుత్తమంగా ఉంటుంది. అయితే, బ్యాటింగ్ నాలెడ్జ్ విషయంలో మాత్రం.. జో రూట్, స్టీవ్ స్మిత్.. వేరే లెవల్ అంతే!
బాబర్ ఈ విషయంలో వాళ్లంత క్లెవర్ కాదు. మ్యాచ్‌ను అంచనా వేయడంలో వారిద్దరు సూపర్. అయితే, ఈ ఇద్దరిలోనూ స్మిత్‌కు నంబర్ వన్, రూట్‌కు రెండో ర్యాంకు ఇస్తాను. వారి తర్వాత బాబర్ ఆజం’’ అని మహ్మద్ జాహిద్ పేర్కొన్నాడు.
కోహ్లి కంటే రోహిత్ బెటర్
ఇక విరాట్ కోహ్లి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ పేరును ఎవరు తిరస్కరించగలరు. అయితే, నా వరకు కోహ్లి కంటే రోహిత్ శర్మ బెటర్. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ రోహిత్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో అతడికి ఎవరూ సాటిరారు. తనొక గిఫ్టెడ్ ప్లేయర్. ఇంజమామ్ ఉల్ హక్ మాదిరి తొందరగా బంతిని అంచనా వేసి.. ఏ షాట్ ఆడాలో నిర్ణయించుకుంటాడు’’ అని మహ్మద్ జాహిద్ చెప్పుకొచ్చాడు.
సెంచరీల వీరుడిని కాదని
కాగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్‌గా పేరొందిన కోహ్లి.. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో సాధించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు చేరువగా వచ్చాడు ఈ రన్‌మెషీన్. ఇప్పటి వరకు 80 సెంచరీలు బాది.. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు.
ఇక ఇప్పటికే షోయబ్ అక్తర్ వంటి పలువురు పాక్ మాజీ క్రికెటర్లు వరల్డ్ నంబర్ వన్‌గా కోహ్లి పేరు చెప్పగా.. జాహిద్ మాత్రం కోహ్లిని కాదని.. బాబర్ ఆజం, రోహిత్ శర్మ, స్మిత్, రూట్‌లకు ఓటు వేశాడు. వీరంతా సెంచరీల విషయంలో కోహ్లి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
లంక సిరీస్‌తో బిజీ
కాగా రోహిత్, కోహ్లి ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో ఫామ్ కొనసాగిస్తుండగా.. కోహ్లి మాత్రం 38 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
మరోవైపు.. పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం కఠినపరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడి సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ దారుణ వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్సీపై మరోసారి వేటుపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment