సౌతాఫ్రికాతో తొలి టెస్టులో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం(Babar Azam) పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఈ క్రమంలో పాక్ అభిమానులు సైతం బాబర్ ఆట తీరుపై మండిపడుతున్నారు. పునరాగమనంలోనూ పాత కథే పునరావృతం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విఫలమైనా.. ఓ అరుదైన రికార్డు
ఇలా ఓవైపు బాబర్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. అతడి ఫ్యాన్స్ మాత్రం బాబర్‌కు మరెవరూ సాటిరారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ అరుదైన రికార్డు సాధించడమే ఇందుకు కారణం.
మూడు ఫార్మాట్లలోనూ
కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం చేసిన నాలుగు పరుగుల కారణంగా.. టెస్టుల్లో అతడు నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా పాక్ తరఫున.. టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
కోహ్లి, రోహిత్ తర్వాత
అంతేకాదు.. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ బాబర్ ఆజం అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) మాత్రమే ఈ ఘనత సాధించారు.
కాగా బాబర్ ఆజం ఇప్పటి వరకు 56 టెస్టుల్లో కలిపి 4001 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 123 వన్డేల్లో 19 సెంచరీలు, 34 ఫిఫ్టీల సాయంతో బాబర్ 5957 రన్స్ పూర్తి చేసుకున్నాడు.
కష్టాల్లో పాక్ జట్టు
అంతేకాదు.. 128 అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలు, 36 హాఫ్ సెంచరీ సాయంతో 4223 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెంచూరియన్‌లో గురువారం మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ప్రొటిస్ బౌలర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలగా.. కమ్రాన్ గులామ్(54) అర్థ శతకంతో ఆదుకున్నాడు.
ఇక మహ్మద్ రిజ్వాన్(27), అమీర్ జమాల్(28) మాత్రమే ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తుశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 195 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది షాన్ మసూద్ బృందం. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో తొలి మ్యాచ్ తర్వాత బాబర్ ఆజంపై వేటు పడగా.. మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై అతడు టెస్టుల్లో పునరాగమనం చేశాడు.
చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment