‘ఆరెంజ్‌’ అడుగు పడింది | Mohammed Siraj living the dream, stars in must-win game for Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆరెంజ్‌’ అడుగు పడింది

Published Sun, May 14 2017 1:47 AM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

‘ఆరెంజ్‌’ అడుగు పడింది - Sakshi

‘ఆరెంజ్‌’ అడుగు పడింది

ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌l
చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌పై 8 వికెట్లతో ఘన విజయం l
సిరాజ్‌కు 4 వికెట్లు   


ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ దీటుగా నిలబడింది. ట్రోఫీని నిలబెట్టుకునే క్రమంలో తొలి దశను విజయవంతంగా అధిగమించింది. ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెలరేగింది. ఇతర జట్ల ప్రదర్శన, సమీకరణాలను పట్టించుకోవాల్సిన అవసరం రాకుండా తమ సత్తాను నమ్ముకొని సగర్వంగా ప్లే ఆఫ్‌ దశకు చేరుకుంది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి ముందంజ వేసిన ‘ఆరెంజ్‌ ఆర్మీ’ మరో టైటిల్‌ వేటలో తానూ ఉన్నానని తమ బలమైన ఆటతో సంకేతాలు ఇచ్చింది.

గుజరాత్‌ స్కోరు ఒక దశలో 111/0... కానీ కేవలం 43 పరుగులకే ఆ జట్టు 10 వికెట్లూ కోల్పోయి బేలగా నిలబడిపోయింది.  దూసుకుపోతున్న ప్రత్యర్థిని రైజర్స్‌ బౌలర్లు సిరాజ్, రషీద్‌ ఖాన్‌ పదునైన బంతులతో కుప్పకూల్చారు. గ్రీన్‌పార్క్‌లాంటి చిన్న మైదానంలో ఈ సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. వార్నర్‌ తన భీకర ఫామ్‌ను కొనసాగించగా, అంది వచ్చిన అవకాశాన్ని విజయ్‌ శంకర్‌ ఉపయోగించుకోవడంతో లయన్స్‌ అవమాన భారంతో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పింది.  

కాన్పూర్‌: ఐపీఎల్‌–2017లో ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తుగా ఓడించి ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డ్వేన్‌ స్మిత్‌ (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 65 బంతుల్లోనే 111 పరుగులు జోడించారు.

 హైదరాబాద్‌ బౌలర్లు సిరాజ్‌ (4/32), రషీద్‌ (3/34), భువనేశ్వర్‌ (2/25) చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. తొలి పది ఓవర్లలో మొదటిసారి వికెట్‌ తీయలేకపోయిన రైజర్స్, తర్వాత పది ఓవర్లలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం విశేషం. అనంతరం సన్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. వార్నర్‌ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 9 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (44 బంతుల్లో 63 నాటౌట్‌; 9 ఫోర్లు) మూడో వికెట్‌కు 91 బంతుల్లో అభేద్యంగా 133 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. 4 వికెట్లతో చెలరేగిన మొహమ్మద్‌ సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 5 మ్యాచ్‌లు కూడా రైజర్స్‌ గెలిచింది.

భారీ భాగస్వామ్యం నుంచి...
గుజరాత్‌కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆ జట్టు కనీసం 200 పరుగులు చేస్తుందేమో అనిపించింది. ఓపెనర్లు స్మిత్, ఇషాన్‌ పోటీ పడి ధాటిగా పరుగులు సాధించారు. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో 11 పరుగులు రాగా, తర్వాతి రెండు ఓవర్లలో ఇషాన్‌ 2 సిక్సర్లు, ఫోర్‌ కొట్టడంతో మరో 22 పరుగులు లభించాయి. నబీ వేసిన నాలుగో ఓవర్లో 2 పరుగులే వచ్చినా... ఆ తర్వాత కూడా లయన్స్‌ జోరు తగ్గలేదు.

 తర్వాతి మూడు ఓవర్లలో ఆ జట్టు 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 38 పరుగులు రాబట్టింది. రషీద్‌ తొలి ఓవర్లో కూడా గుజరాత్‌ 17 పరుగులు సాధించగా, ఇషాన్‌ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వరుసగా బౌండరీలు సాధించిన స్మిత్‌ 31 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ జోడి 57 బంతుల్లోనే 100 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు 11వ ఓవర్లో ఈ భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

 ఆ తర్వాత సిరాజ్, రషీద్‌ వేసిన ఓవర్లు ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాయి. ముందుగా సిరాజ్‌ తన మూడో బంతికి ఇషాన్‌ను అవుట్‌ చేసి, చివరి బంతికి రైనా (2) వికెట్‌ కూడా తీశాడు. తర్వాతి ఓవర్లోనే రషీద్‌... దినేశ్‌ కార్తీక్‌ (0), ఫించ్‌ (2)లను అవుట్‌ చేయడంతో గుజరాత్‌ పరిస్థితి దిగజారింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లయన్స్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఫాల్క్‌నర్‌ (8), సాంగ్వాన్‌ (0)లను వరుస బంతుల్లో సిరాజ్‌ వెనక్కి పంపగా... రవీంద్ర జడేజా (14 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

కీలక అర్ధ సెంచరీలు...
ఛేదనలో సన్‌రైజర్స్‌ మొదట్లో కాస్త తడబాటుకు గురైంది. సాంగ్వాన్‌ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు కొట్టిన ధావన్‌ (11 బంతుల్లో 18; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ప్రవీణ్‌ కుమార్‌ ఒకే ఓవర్లో ధావన్, హెన్రిక్స్‌ (4)లను అవుట్‌ చేయడం గుజరాత్‌కు ఆనందాన్నిచ్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ 47 పరుగులు చేసింది. ఈ దశలో వార్నర్‌ తన సహజశైలికి భిన్నంగా సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించగా, విజయ్‌ శంకర్‌ తొలిసారి సీజన్‌లో తన ముద్ర చూపించాడు.

వార్నర్‌ 29 పరుగుల వద్ద ఉన్న సమయంలో అంపైర్‌ నిర్ణయం రైజర్స్‌కు కలిసొచ్చింది. సోని బౌలింగ్‌లో వార్నర్‌ బ్యాట్‌ను తగిలి బంతి కీపర్‌ కార్తీక్‌ చేతుల్లో పడ్డా అంపైర్‌ దానిని సరిగా గుర్తించకుండా నాటౌట్‌గా ప్రకటించారు. దీంతో ముందుగా వార్నర్‌ 41 బంతుల్లో, విజయ్‌ శంకర్‌ 35 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి మలుపులు, సమస్య లేకుండా హైదరాబాద్‌ విజయం దిశగా వేగంగా దూసుకుపోయింది. 19వ ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టి వార్నర్‌ జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చాడు.

ముగిసిన గుజరాత్‌ ప్రస్థానం
ఐపీఎల్‌లో రెండేళ్ల గుజరాత్‌ లయన్స్‌ ఆట శనివారంతో ముగిసింది. వచ్చే ఏడాది నుంచి రెండు పాత జట్లు తిరిగి వస్తాయని బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో 2018 సీజన్‌ నుంచి ఈ జట్టు కనిపించదు. రెండు సీజన్లలో కలిపి మొత్తం 30 మ్యాచ్‌లు ఆడిన లయన్స్‌ 13 గెలిచి 16 ఓడగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2016లో 9 మ్యాచ్‌లు గెలిచి నంబర్‌వన్‌గా ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించిన లయన్స్‌... ఈసారి కేవలం 4 విజయాలు సాధించి ఏడో స్థానంతో ముగించింది.

స్కోరు వివరాలు
గుజరాత్‌ లయన్స్‌ ఇన్నింగ్స్‌: డ్వేన్‌ స్మిత్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్‌ ఖాన్‌ 54; ఇషాన్‌ కిషన్‌ (సి) నమన్‌ ఓజా (బి) సిరాజ్‌ 61; రైనా (సి) ధావన్‌ (బి) సిరాజ్‌ 2; దినేశ్‌ కార్తీక్‌ (సి) హుడా (బి) రషీద్‌ ఖాన్‌ 0; ఫించ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 2; జడేజా నాటౌట్‌ 20; ఫాల్క్‌నర్‌ (బి) సిరాజ్‌ 8; సాంగ్వాన్‌ (బి) సిరాజ్‌ 0; అంకిత్‌ సోని (బి) సిద్ధార్థ్‌ కౌల్‌ 0; ప్రవీణ్‌ కుమార్‌ (బి) భువనేశ్వర్‌ 1; మునాఫ్‌ పటేల్‌ (బి) భువనేశ్వర్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 154.

వికెట్ల పతనం: 1–111, 2–120, 3–120, 4–120, 5–123, 6–142, 7–142, 8–153, 9–154, 10–154.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.2–0–25–2, మొహమ్మద్‌ సిరాజ్‌ 4–0–34–4, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–0–30–1, నబీ 3–0–17–0, రషీద్‌ ఖాన్‌ 4–0–34–3, హెన్రిక్స్‌ 1–0–12–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: డేవిడ్‌ వార్నర్‌ నాటౌట్‌ 69; ధావన్‌ (సి) ఫాల్క్‌నర్‌ (బి) ప్రవీణ్‌ కుమార్‌ 18; హెన్రిక్స్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ప్రవీణ్‌ కుమార్‌ 4; విజయ్‌ శంకర్‌ నాటౌట్‌ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1–20, 2–25.

బౌలింగ్‌: ప్రవీణ్‌ కుమార్‌ 4–0–22–2, సాంగ్వాన్‌ 4–0–37–0, ఫాల్క్‌నర్‌ 2–0–24–0, మునాఫ్‌ పటేల్‌ 3–0–22–0, రవీంద్ర జడేజా 3–0–19–0, అంకిత్‌ సోని 2.1–0–31–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement