నా క్రికెట్ కెరీర్లో అతనే బెస్ట్!
కొలంబో:మహేంద్ర సింగ్ ధోని వారుసుడిగా టీమిండియా క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లిపై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ క్రికెట్ జట్టులో ధోని తరువాత అదే స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాల్లో కల్గిన వ్యక్తి కోహ్లి అని మురళీ ధరన్ అభిప్రాయపడ్డాడు.
'నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్లలో ధోని ఒకడు. అతని నాయకత్వంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడు సంవత్సరాలు ఆడాను. నేను ఐపీఎల్ ఆడిన ఏ సందర్భంలో కూడా ధోనిలో గర్వం కనబడలేదు. ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లకు గౌరవించే వ్యక్తిత్వం ధోనిదే. చెన్నై జట్టులో ఆడిన మైక్ హస్సీతో పాటు నా నుంచి కూడా అనేక సలహాలను ధోని తీసుకునేవాడు. కింది నుంచి పైకి వచ్చిన ధోని ఆ స్థాయిని మరచిపోకుండా ఎప్పుడూ హుందాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ బాధ్యతను కోహ్లి సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకుంది. ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ను కోహ్లి తేలిగ్గా తీసుకోకూడదు. ధోని సలహాలను తీసుకుంటూ అతను కెప్టెన్సీ జర్నీని కొనసాగిస్తే మంచింది'అని మురళీ ధరన్ అన్నాడు.