ముంబై సిటీ ఎఫ్‌సీ కోచ్‌గా అనెల్కా
ఐఎస్‌ఎల్ ఫ్రాంచైజీ ప్రకటన
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్ కోసం ముంబై సిటీ ఎఫ్‌సీ తమ జట్టు కోచ్ కమ్ ఆటగాడిగా స్ట్రయికర్ నికోలస్ అనెల్కాను నియమించింది. తన నాయకత్వంలో ముంబై జట్టు ఈసారి మెరుగైన ఫలితాలను రాబడుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటగాడు గత సీజన్‌లో రెండు గోల్స్ సాధించాడు. ‘ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై సిటీ ఎఫ్‌సీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈసారి కచ్చితంగా గట్టి పోటీనిచ్చి టైటిల్ బరిలో నిలుస్తామని ఆశిస్తున్నాను’ అని 36 ఏళ్ల అనెల్కా తెలిపాడు. అలాగే గత ఏడాది తన అద్భుత నైపుణ్యంతో పాటు యువ ఆటగాళ్లను ఉత్తేజపరిచిన విధానం తమను ఆకట్టుకుంటుందని, అందుకే ఈసారి కోచ్ బాధ్యతను కూడా అనెల్కాకే కట్టబెట్టినట్టు టీమ్ యజమాని రణబీర్ కపూర్ తెలిపాడు.
69 అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు అనెల్కాకు అర్సెనల్, చెల్సీ, మాంచెస్టర్ సిటీ, రియల్ మాడ్రిడ్, లివర్‌పూల్, జువెంటస్ లాంటి అగ్రశ్రేణి క్లబ్బుల తరఫున ఆడిన అనుభవం ఉంది. అలాగే 2012లోనూ అనెల్కా.. చైనీస్ క్లబ్ షాంఘై షెన్హువాకు ఇలాగే రెండు బాధ్యతలు నిర్వర్తించాడు.