రంజీ ఫైనల్లో ముంబై
పృథ్వీ షా సెంచరీ
రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో 41 సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో ఆ జట్టు మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ ముగిసిన సెమీ ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన 17 ఏళ్ల పృథ్వీ షా (175 బంతుల్లో 120; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. శ్రేయస్ అయ్యర్ (40), వాఘేలా (36), సూర్యకుమార్ యాదవ్ (34) అతనికి అండగా నిలిచారు. 99 పరుగుల వద్ద పృథ్వీ గల్లీలో ఇంద్రజిత్ చక్కటి క్యాచ్ అందుకున్నా... విజయ్ శంకర్ నోబాల్ వేసినట్లు తేలడంతో షా బతికిపోయి తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ నెల 10నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో గుజరాత్‌తో ముంబై తలపడుతుంది.
►1993–94 సీజన్‌లో అమోల్ మజుందార్ తర్వాత రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. అసమాన ప్రతిభ ఉన్న ఈ కుర్రాడు మూడేళ్ల క్రితం 14 సంవత్సరాల వయసులో స్కూల్ క్రికెట్‌లో రికార్డు పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. నాడు 330 బంతుల్లో అతను ఏకంగా 546 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత ప్రణవ్ ధనవాడే 1009 పరుగులు చేసే వరకు అదే రికార్డుగా కొనసాగింది. తన అద్భుత ఆటతీరును గుర్తించి ముంబై రంజీ జట్టులో అవకాశం కల్పించగా, సెంచరీతో అతను దానిని నిలబెట్టుకోవడం విశేషం.