ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీని 167/8 పరుగులకే కట్టడి చేసిన ముంబై ఇండియన్స్ టోర్నీలో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విఫలమై ఓటమి పాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి(92 నాటౌట్; 62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో మెరవగా, మెక్లీన్‌గన్, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. ఇక మయాంక మార్కండే వికెట్ తీశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94;52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా, అతనికి జతగా ఓపెనర్ లూయిస్(65; 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 5 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో అజేయంగా 17 పరుగులు సాధించాడు.
తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు
ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లను కోల్పోయింది. ఆర్సీబీ పేసర్ ఉమేష్ యాదవ్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌల్డ్ కాగా, రెండో బంతికి ఇషాన్ కిషాన్ సైతం బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇక్కడ గమనార్హం.
టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో ముంబై బ్యాటింగ్‌ను సూర్యకుమార్ యాదవ్, లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ స్టైకింగ్ తీసుకోగా, లూయిస్ నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి సూర్యకుమార్ యాదవ్ వికెట్లను సమర్పించుకోగా, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ కూడా అదే బాటలో పయనించాడు. దాంతో ముంబై ఇండియన్స్ పరుగులేమీ లేకుండానే రెండు వికెట్లను కోల్పోయింది.
ఆదుకున్న లూయిస్
స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా రెండు వికెట్ల కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను ఎవిన్ లూయిస్ ఆదుకున్నాడు. వికెట్లు పడినప్పటికీ తనదైన మార్కును ఆటను ప్రదర్శించడంలో ఎటువంటి వెనుకడుగు వేయలేదు. బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ శర్మ నుంచి సహకారం లభించడంతో లూయిస్ బ్యాట్‌కు మరింత పనిచెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి ఆర్సీబీ బౌలర్లను ఆడేసుకోవడంతో స్కోరులో వేగం పెరిగింది. ఈ జోడి మూడో వికెట్‌కు 108 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔటయ్యాడు. ఆపై ధాటిగా బ్యాటింగ్ చేసే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న రోహిత్.. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో ముంబై రెండొందల మార్కును సునాయాసంగా దాటేసింది. కాకపోతే 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ ఔటై తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment