ఆమ్లా సెంచరీ వృథా.. ముంబై ఘన విజయం
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో మరోసారి పరుగుల మోత మోగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై పరుగుల పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఐపీఎల్ -10లో సంజూ శాంసన్ తర్వాత పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా శతకాన్ని బాదాడు.
హషీమ్ ఆమ్లా అజేయ శతకం (104 నాటౌట్; 60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు), మ్యాక్స్ వెల్(40;18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్ష్(26) పరవాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ కు రెండు వికెట్లు లభించగా, కృణాల్ పాండ్యా, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.
199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. పార్థీవ్ పటేల్(37; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. స్టోయినిస్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై నితీశ్ రాణా(62 నాటౌట్; 34 బంతుల్లో 7 సిక్సర్లు) తో కలిసి ఓపెనర్ బట్లర్ (77; 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వీరి ధాటికి పంజాబ్ బౌలర్ ఇషాంత్ శర్మ 4 ఓవర్లలో 58 పరుగులు సమర్పించుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(15; 4 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో ముంబై మరో 27 బంతులు మిగిలుండగానే 199 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి పంజాబ్‌కు షాకిచ్చింది. తద్వారా 10 పాయింట్లతో పట్టికలో రోహిత్ సేన తొలి స్థానాన్ని ఆక్రమించింది.