సిమ్మన్స్, పొలార్డ్ మెరుపులు
ఢిల్లీ: గత మ్యాచ్ లో రెండొందల పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరోసారి భారీ సవాల్ ఎదురైంది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లు లెండిల్ సిమ్మన్స్ (66;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(63 నాటౌట్;35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, పార్ధీవ్ పటేల్(25; 22 బంతుల్లో 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(29 నాటౌట్;14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, పార్దీవ్ పటేల్లు ఆకట్టుకున్నారు. ఈ జోడి తొలి వికెట్ కు 79 పరుగులు జత చేయడంతో ముంబై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తరువాత సిమ్మన్స్-పొలార్డ్ జోడి కూడా దాటిగా బ్యాటింగ్ చేయడంతో దాదాపు 10 పరుగుల రన్ రేట్ స్కోరు బోర్డుపై నిలిచింది. ఈ క్రమంలోనే సిమ్మన్స్ తొలుత హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, ఆపై పొలార్డ్ కూడా అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటంతో ముంబై రెండొందల మార్కును దాటింది.