నాగ్ పూర్ పిచ్ పై మ్యాచ్ రిఫరీ నివేదిక
దుబాయ్: ఇది నిజంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు ఇబ్బంది కల్గించే పరిణామమే. దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య మూడో టెస్టు సిరీస్ జరిగిన నాగ్ పూర్ పిచ్ చాలా పేలవంగా ఉందంటూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తాజాగా రూపొందించిన నివేదికలో స్పష్టం చేశారు. పిచ్ మానిటరింగ్ లో భాగంగా జెఫ్ క్రో నాగ్ పూర్ పిచ్ ను పరిశీలించారు. ఐసీసీ ఆర్టికల్ 3 ప్రకారం నాగ్ పూర్ పిచ్ చాలా నిర్జీవంగా ఉందంటూ జెఫ్ క్రో తన నివేదికలో పేర్కొన్నారు.
దీనిపై రూపొందించిన నివేదకను ఐసీసీతో పాటు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కూడా అందజేశారు. ఈ నివేదికపై 14 రోజుల్లో బీసీసీఐ తమ సమాధానాన్ని తెలియజేయాల్సి ఉంది. కాగా, పిచ్ నివేదికపై బీసీసీఐ నుంచి సమాధానం వచ్చిన తరువాత ఆ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని ఐసీసీ చీఫ్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే నేతృత్వంలోని కొంతమంది సభ్యుల బృందం పరిశీలిస్తోంది. అనంతరం నాగ్ పూర్ పిచ్ పై చర్యలు చేపట్టే అవకాశం ఉంది.