సునీల్ నరైన్ మరో చరిత్ర | Narine has the fastest IPL fifty | Sakshi
Sakshi News home page

సునీల్ నరైన్ మరో చరిత్ర

Published Sun, May 7 2017 7:05 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

సునీల్ నరైన్ మరో చరిత్ర

సునీల్ నరైన్ మరో చరిత్ర

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో నరైన్ 15 బంతుల్లో  5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. తద్వారా యూసఫ్ పఠాన్ సరసన నిలిచాడు. అంతకుముందు 2014లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును కోల్ కతాకు చెందిన నరైన్ చేరుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్ కతా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా రికార్డులకెక్కింది. అయితే 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసిన తరువాత నరైన్ తొలి వికెట్ గా అవుటయ్యాడు.


అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో  4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో  3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా  ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement