ట్రావిస్ హెడ్ దూకుడు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
మరోసారి 'టాప్' విఫలం..
ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశల్ని కోల్పోయి కనీసం చివరి మ్యాచ్ ల్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్న ఆర్సీబీ అందుకు తగ్గట్లు ఆడటం లేదు. ప్రధానంగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ లు తీవ్రంగా నిరాశపరుస్తుండంతో ఆర్సీబీ భారీ స్కోర్లు చేయలేకపోతుంది. ఈ మ్యాచ్ లో గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరగా, కోహ్లి ఓ చెత్త షాట్ ఆడి ఎల్బీగా పెవిలియన్ చేరాడు.ఆపై డివిలియర్స్ బౌల్డ్ గా నిష్ర్రమించాడు. దాంతో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు కలిసి చేసిన పరుగులు 15 మాత్రమే కావడంతో ఆర్సీబీకి ఆదిలోనే చుక్కెదురైంది. కాగా, మధ్యలోమన్ దీప్ సింగ్ ఆదుకోవడం, ఆ తరువాత హెడ్ దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, సునీల్ నరైన్ రెండు వికెట్లు, క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు.