మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ హేస్టింగ్స్ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ స్టార్స్‌కి బ్రిస్బెన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్ బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్ అయిన హేస్టింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బెన్ కటింగ్ వేసిన ఓ షార్ట్ బాల్ బంతి వేగంగా దూసుకొచ్చి ఆయన తల కుడివైపు బలంగా తాకింది. బాల్ దాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది.
హేస్టింగ్స్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి లోనైన హేస్టింగ్స్ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. మూడేళ్ల క్రితం ఫిలిప్ హ్యూస్ మరణ ఘటనను గుర్తు చేసిన ఈ ఘటన ఆటగాళ్లను కొంత సేపు కలవరపెట్టింది. హెల్మెట్ లేకుంటే హేస్టింగ్స్ పరిస్థితేంటీ అని ప్లేయర్లంతా భయాందోళనలకు గురయ్యారు.
2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో ఫిలిప్ హ్యూస్ గాయపడి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment