Big Bash
-
హెల్మెట్ లేకుంటే ఈ బ్యాట్స్‌మన్ పరిస్థితేంటీ .!
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ హేస్టింగ్స్ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్ బోర్న్ స్టార్స్‌కి బ్రిస్బెన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్ బోర్న్ స్టార్స్‌కి కెప్టెన్ అయిన హేస్టింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బెన్ కటింగ్ వేసిన ఓ షార్ట్ బాల్ బంతి వేగంగా దూసుకొచ్చి ఆయన తల కుడివైపు బలంగా తాకింది. బాల్ దాటికి హేస్టింగ్స్ హెల్మెట్ ఎగిరి పడింది. హేస్టింగ్స్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి లోనైన హేస్టింగ్స్ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. మూడేళ్ల క్రితం ఫిలిప్ హ్యూస్ మరణ ఘటనను గుర్తు చేసిన ఈ ఘటన ఆటగాళ్లను కొంత సేపు కలవరపెట్టింది. హెల్మెట్ లేకుంటే హేస్టింగ్స్ పరిస్థితేంటీ అని ప్లేయర్లంతా భయాందోళనలకు గురయ్యారు. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో ఫిలిప్ హ్యూస్ గాయపడి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది. -
టెస్టులను టి20లు నాశనం చేయడం ఖాయం
ఫికా ఆందోళన మెల్బోర్న్: ఐపీఎల్, బిగ్ బాష్ లాంటి టి20 లీగ్‌లు భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు తీరని నష్టాన్ని కలగజేయడం ఖాయమని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘం సమాఖ్య (ఫికా) సీఈవో టోనీ ఐరిష్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టెస్టు ఫార్మాట్లో ఐసీసీ విప్లవాత్మక మార్పులు చేపట్టకపోతే మున్ముందు ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ కనుమరుగైనా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే ప్రస్తుత భవిష్యత్ పర్యటనల కార్యక్రమం 2019లో ముగుస్తుంది కాబట్టి అప్పటిదాకా ఎలాంటి మార్పులు చేయలేమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. ‘2019 వరకు వేచిచూస్తే ద్వైపాక్షిక క్రికెట్ ప్రమాదంలో పడుతుంది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో జాతీయ జట్టుకు ఆడకుండా ఫ్రీలాన్స్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టి20 లీగ్‌ల్లో ఆడేందుకే మొగ్గు చూపిస్తామని చాలా మంది క్రికెటర్లు మాతో చెబుతున్నారు. ఆటగాళ్లకు డబ్బులు ఇచ్చే దేశాల్లో టెస్టులకు ఢోకా ఉండదు. కానీ చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించదు’ అని ఐరిష్ అన్నారు.