ముంబై: ఇకనుంచి భారత క్రికెట్ జట్లకు సంబంధించిన కోచ్‌ల పదవీ కాలం రెండేళ్లపాటు ఉండాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అన్ని ఒప్పందాలు రెండేళ్ల పాటు ఉంటాయని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ తేల్చి చెప్పారు. దీంతో జాతీయ జట్టు నుంచి అండర్–19 వరకు ఉండే కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో పనిచేసే అవకాశం కోల్పోనున్నారు. ఒకవేళ భారత్ ‘ఎ’, అండర్–19 కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఒప్పందాన్ని పొడిగిస్తే అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరో సీఓఏ సభ్యుడు తెలిపారు.