కాంబోడియాతో భారత్ పోరు నేడు
ఫానోమ్ పెన్: ఈనెల చివరివారం నుంచి జరిగే ఏసీసీ ఆసియా కప్ క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహకంగా కాంబోడియా జట్టుతో బుధవారం భారత్ స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. భారత్ కంటే 41 స్థానాలు వెనుకంజలో ఉన్న కాంబోడియాతో మ్యాచ్ ద్వారా జట్టు కూర్పుపై ఓ అవగాహనకు రావచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. చివరిసారిగా గత సెప్టెంబర్‌లో ప్యూర్టొరికోతో మ్యాచ్ ఆడిన భారత్ ఆమ్యాచ్‌లో 4–1తో ఘనవిజయం సాధించింది.
కెప్టెన్ గురుప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో అన్ని విభాగాల్లో రాణించిన భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు భారత్ చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మయన్మార్‌తో జరిగే క్వాలిఫయర్స్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌లో విజయం చాల ముఖ్యమని జట్టు భావిస్తోంది. మరోవైపు కాంబోడియా రికార్డు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. చివరిసారిగా గత జనవరిలో సౌదీ అరేబియాతో ఆడిన కాంబోడియా 2–7తో చిత్తుగా ఓటమిపాలైంది. మరోవైపు గత ఐదు మ్యాచ్‌ల్లోనూ కాంబోడియా గెలుపు రుచి చూడలేదు. దీంతో ఈమ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.