
సెంచూరియన్:టీమిండియాతో తొలి టీ 20లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ వైఫల్యం చెందడంపై ఆ జట్టు కెప్టెన్ జేపీ డుమినీ అసహనం వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ చాలా దుర్బలంగా ఉన్న కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. దీనికి సీనియర్ బ్యాట్స్‌మెన్లతో ఆటగాళ్లకు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందన్నాడు. ఒకసారి జట్టుగా అద్దంలో చూసుకుందామని ఆటగాళ్లకు చురకలంటించాడు. ఆ తర్వాత మన ప్రదర్శనని మెరుగు పరుచుకుందామన్నాడు.
'మనల్ని మనమే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎలా మెరుగ్గా ఆడాలనే దానిపై ఎవరికి వారే సమీక్ష జరుపుకుందాం. ఇక్కడ కొత్త ఆటగాళ్లు, సీనియర్ అనే తేడా ఏమీ ఉండదు. కెరీర్‌లో ఎత్తు పల్లాలు అనేవి సహజం. రాబోయే మ్యాచ్‌ల్లో సత్తాచాటడానికి యత్నిస్తాం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేసి గెలుపు బాట పడతాం. తొలి టీ20 కొన్ని చేతుల్లోకి వచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్నాం. బుధవారం జరిగే రెండో టీ20లో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మెరుగైన ప్రదర్శన చేద్దాం' అని సహచరులకు డుమినీ హిత బోధ చేశాడు.