
కేప్‌టౌన్: టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఓటమి చెందడం పట్ల దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమినీ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఓటమికి భారత బౌలర్లు నియంత్రణతో కూడిన బౌలింగ్ చేయడమే ప్రధాన కారణమని డుమినీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు పవర్ ప్లేలో అద్బుతంగా బౌలింగ్ చేసి తమను హిట్టింగ్ చేయకుండా కట్టడి చేశారన్నాడు. తొలి ఆరు ఓవర్లలో బౌండరీలను సాధించడం కంటే కూడా సింగిల్స్ తీయడమే గగనంగా మారిపోయిందన్నాడు.
భారత పేసర్లు నకుల్ బాల్స్, స్లో బంతులతో తమను బాగా ఇబ్బంది పెట్టారన్నాడు. దాంతో పవర్ ప్లేలో 30 పరుగులు వెనుకబడిపోయామని, అదే ఓటమిపై ప్రభావం చూపిందని డుమినీ విశ్లేషించాడు. ఇక్కడ క్రెడిట్ మొత్తం భారత జట్టుదేనని ప్రశంసించాడు. చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించిన తర్వాత ఆ జట్టులో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందన్నాడు. దాంతోనే వరుసగా రెండు సిరీస్‌లను కైవసం చేసుకుని తమకు షాకిచ్చారన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఓటముల నుంచి పాఠం నేర్చుకున్నామన్నాడు. ఇదొక అద్భుతమైన సిరీస్‌గా డుమినీ అభివర్ణించాడు. తమ యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాల్ని బాగా ఉపయోగించుకోవడం శుభపరిణామం అని డుమినీ పేర్కొన్నాడు.