భారత్కు భారీ లక్ష్యం
మొహాలి:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)స్టేడియంలో భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఆల్ రౌండర్గా పేరున్న నీషమ్ ( 57 ; 47 బంతుల్లో 7 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో కివీస్ 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఓ దశలో 199 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్.. నీషమ్ సొగసైన ఇన్నింగ్స్తో తేరుకుని భారీ స్కోరును సాధించకల్గింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఆదిలో కుదురుగా ఆడినప్పటికీ, కీలక సమయంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో గప్టిల్(27), కేన్ విలియమ్సన్(22)మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఆ తరువాత టామ్ లాధమ్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 73 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత టేలర్ (44) మూడో వికెట్ గా అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 28.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు. అయితే కోరీ అండర్సన్(6), ల్యూక్ రోంచీ(1) లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో కివీస్ ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత టామ్ లాధమ్(61)కూడా నిష్కమించడంతో కివీస్ 169 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.
ఆపై సాంట్నార్(7), సౌతీ(13)ల వికెట్లను తీసి పైచేయి సాధించినట్లు కనిపించిన భారత్ను నీషామ్ తీవ్రంగా ప్రతిఘటించాడు. టెయిలెండర్ హెన్రీతో కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే నీషామ్ హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు హెన్రీ(39 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్ ) కూడా ధాటిగా ఆడాడు. దాంతో కివీస్ 49. 4 ఓవర్లలో 285 పరుగులకు చేసి ఇంకా రెండు బంతులుండగా ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో కేదర్ జాదవ్, ఉమేశ్ యాదవ్ తలో మూడు వికెట్లు సాధించగా, అమిత్ మిశ్రా, బూమ్రాలు చెరో రెండు వికెట్లు లభించాయి.