అక్కడ భారత్..ఇక్కడ కివీస్!
మొహాలీ:న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే క్రమంలో భారత ఆటగాళ్లు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటే.. వన్డే సిరీస్లో కివీస్ ఆటగాళ్లు పలు ఘనతలను సాధిస్తున్నారు. గత వన్డేలో టిమ్ సౌథీ 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అర్థ శతకాన్ని సాధించడం ద్వారా ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ వన్డే ఇన్నింగ్స్ ల్లో 10 లేదా 11 వ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి అర్థశతకం సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు. తాజా వన్డేలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. తద్వారా 9వ వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన కివీస్ జోడిగా నిలిచింది. ఈ భాగస్వామ్యంతో 2009లో భారత్ పై 9 వికెట్ కు కివీస్ జోడి మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యం చెరిగిపోయింది.
అంతకుముందు జరిగిన టెస్టు సిరీస్లో రవి చంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిలు పలు అరుదైన ఘనతలను సాధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు ద్వారా అశ్విన్ రెండొందల వికెట్ల క్లబ్లో చేరాడు. దాంతో అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా గుర్తింపు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. దీంతో గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించిన స్ట్రైక్ రేట్ (49.4)ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా విరాట్ 347 బంతుల్లో 18 ఫోర్లు సాయంతో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. ఇది విరాట్ టెస్టు కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ. తద్వారా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత కెప్టెన్ గా కోహ్లి కొత్త చరిత్ర సృష్టించాడు. మూడు టెస్టుల సిరీస్లో రికార్డులను ఖాతాలో వేసుకున్న భారత్.. ఇప్పుడు సుదీర్ఘ వన్డే సిరీస్లో రికార్డులను సమర్పించుకుంటుంది.