కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో నేడు ఇరు జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి. భారత్, కివీస్ చెరో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు అవకాశం ఉంది. 1986 నుంచి 14 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియంలో తొలిసారి డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది.
బ్యాట్స్‌మెన్ చెలరేగితే...
రెండో వన్డేలో అలవోక విజయం సాధించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ధావన్ అర్ధ సెంచరీ సాధించగా మరో ఓపెనర్ రోహిత్ రెండు వన్డేల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. అతను తన సహజశైలిలో చెలరేగితే భారీ స్కోరుకు పునాది పడుతుంది. కోహ్లి బ్యాటింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. అయితే అనూహ్యంగా నాలుగో స్థానంలో వచ్చి అర్ధ సెంచరీ సాధించిన దినేశ్ కార్తీక్ తన వన్డే కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో అతను మరోసారి కీలకం కానున్నాడు. ధోని, పాండ్యా తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శిస్తే భారత్‌కు తమ బ్యాటింగ్‌తోనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది. ఇక స్వింగ్‌తో కింగ్‌లా చెలరేగిపోతున్న భువనేశ్వర్ తన సొంత రాష్ట్రంలో గుర్తుంచుకునే ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి బుమ్రా నుంచి తగిన సహకారం లభిస్తోంది. వికెట్లపైనే నేరుగా కచ్చితత్వంతో బంతులు విసిరి రెండో వన్డేలో కివీస్‌ను కట్టి పడేసిన అక్షర్‌కు మళ్లీ చోటు ఖాయం కాగా... సొంతగడ్డపై కుల్దీప్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే చహల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది.
విలియమ్సన్ రాణించేనా...
తొలి వన్డేలో గెలిచిన తర్వాత న్యూజిలాండ్ ఒక్కసారిగా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ లోపాలను రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు బహిర్గతం చేశారు. ఇప్పుడు ఇదే కివీస్‌కు సమస్యగా మారింది. ప్రపంచం లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న విలియమ్సన్ విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఈ సారైనా కెప్టెన్ చెలరేగితే కివీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. మిడిలార్డర్‌లో టేలర్, లాథమ్ మరోసారి రాణించాల్సి ఉంది. తాము కూడా సత్తా చాటగలమని నికోల్స్, గ్రాండ్‌హోమ్ గత మ్యాచ్‌లో నిరూపించారు. గత మ్యాచ్‌లో విఫలమైన ప్రధాన పేసర్ బౌల్ట్‌పై కివీస్ ఆశలు పెట్టుకుంది. అతనికి సౌతీ, సాన్‌ట్నర్ నుంచి మంచి సహకారం లభించడం అవసరం. సిరీస్ గెలిచే అరుదైన అవకాశాన్ని కోల్పోరాదని భావిస్తున్న న్యూజిలాండ్ అందు కోసం రెట్టింపు శ్రమించాల్సి ఉంది.
భారత గడ్డపై గతంలో మూడు సార్లు న్యూజిలాండ్ వన్డే సిరీస్ విజయానికి చేరువగా వచ్చింది. అయితే ప్రతీసారి ఫలితాన్ని తేల్చే ఆఖరి మ్యాచ్‌లో చతికిలపడి ఆ అవకాశం కోల్పోయింది. సరిగ్గా ఏడాది క్రితం కూడా 2–2తో సమంగా ఉండి చివరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఇప్పుడు మరోసారి ఆ జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలి వన్డేలో సంచలన ఆటతీరును కనబర్చిన కివీస్, ఆ ఆటను పునరావృతం చేసి
అరుదైన ఘనతను అందుకోవాలని పట్టుదలగా ఉంది.అయితే... బలమైన బ్యాటింగ్, పదునైన పేస్ బౌలింగ్, ఆకట్టుకునే స్పిన్... ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇస్తుందా! మొదటి వన్డేలో అనూహ్య పరాజయానికి గత మ్యాచ్‌లో దీటైన జవాబిచ్చి బరిలో నిలిచిన కోహ్లి సేన మరో పొరపాటు చేయకపోవచ్చు. సొంతగడ్డపై సిరీస్ పరాభవం ఎదురు కాకుండా ఉండేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్న టీమిండియా గత మ్యాచ్ జోరును కొనసాగిస్తే వరుసగానాలుగో సిరీస్ జట్టు ఖాతాలో పడుతుంది.
►83 విరాట్ కోహ్లి మరో 83 పరుగులు చేస్తే వన్డేల్లో 9 వేల పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
► 9 ఈ మైదానంలో ఆడిన 14 వన్డేల్లో భారత్ 9 గెలిచి 5 ఓడింది.
తుది జట్ల వివరాలు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, అక్షర్, బుమ్రా, చహల్/కుల్దీప్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, మిల్నే/సోధి.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న వాతావరణం కారణంగా ఆరంభంలో స్వింగ్‌కు అనుకూలించవచ్చు. రాత్రి సమయంలో మంచు ప్రభావం వల్ల టాస్ కీలకం కానుంది.
► మ.గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment