కోచ్ లకు ప్రామాణికం జాతీయత కాదు!
న్యూఢిల్లీ: క్రీడల్లో కోచ్ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత కల్గినదని, అటువంటి కోచ్ లకు జాతీయతను అంటగట్టడం సరికాదని భారత క్రికెట్ అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో జాతీయత ఆధారంగా కోచ్ ల పాత్రలపై విమర్శల వినిపిస్తున్న నేపథ్యంలో బంగర్ పై విధంగా స్పందించాడు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ మాజీ ఆటగాడు.. కోచ్ అనే వాడు స్వదేశీయుడు(భారత్), విదేశీయుడా?అనే ప్రశ్నే ఉండకూదన్నాడు. ఆ క్రమంలోనే కోచ్ బాధ్యత చేపట్టిన వ్యక్తి నిరంతరం టీం ఎఫెర్ట్ లో పాలుపంచుకుంటూ జట్టును అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలన్నాడు.కోచ్ నిరంతరం కొత్త కొత్త ప్రణాళికలతో జట్టను ముందుకు తీసుకువెళ్లాలని సూచించాడు.
ప్రస్తుతం భారత టీం ప్రధాన కోచ్ గా డంకెన్ ఫ్లెచర్ ను కొనసాగిస్తుండగా, టీం డైరెక్టర్ గా మాజీ ఆటగాడు రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. వీరికి అదనంగా సంజయ్ బంగర్, బి అరుణ్, శ్రీధర్ లను సహాయ కోచ్ లుగా నియమించిన సంగతి తెలిసిందే.