నూతన ‘సాయ్’ పాలక కమిటీ సభ్యులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) పాలక కమిటీ సభ్యులుగా ఇటీవల నియమితులైన వారిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శనివారం ఘనంగా సన్మానించింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులు పాల్గొన్నారు.
ఇటీవలే వీరు ముగ్గురు రాష్ట్ర సాయ్ పాలక కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం, కల్చరల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.