క్రిస్ట్‌చర్చ్: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 36.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది. ఫలితంగా ఇంకా వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(118) సెంచరీ సాధించి జట్టు ఘన విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(65 నాటౌట్) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూడా గప్టిల్(117) శతకం సాధించాడు.
రెండో వన్డేలో న్యూజిలాండ్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ మిథున్(57), షబ్బీర్ రెహ్మాన్(43)లు మాత్రమే రాణించడంతో బంగ్లాదేశ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ మూడు వికెట్లు సాధించగా, టాడ్ ఆస్ట్లే, నీషమ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్‌లకు తలో వికెట్ లభించింది. మూడో వన్డే బుధవారం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment