హామిల్టన్: తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలిచింది కానీ... బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ (171 బంతుల్లో 149; 21 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (229 బంతుల్లో 146; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన నాలుగో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కివీస్ భారీస్కోరు (715/6 డిక్లేర్డ్) దృష్ట్యా విజయం ఖాయమైందని ఉత్సాహంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లను సౌమ్య, మహ్ముదుల్లా ద్వయం చెమటలు కక్కించింది. 307 పరుగుల లోటుతో ఓవర్‌నైట్ స్కోరు 174/4తో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడింది. సౌమ్య సర్కార్, మహ్ముదుల్లా శతకాలతో కదంతొక్కారు.
తమ పోరాటంతో కివీస్ విజయాన్ని అంతకంతకు ఆలస్యం చేశారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 235 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 429 పరుగుల వద్ద ఆలౌటైంది. వాళ్లిద్దరు మినహా ఇంకెవరూ 5 పరుగులైనా చేయలేకపోయారు. సౌమ్యతో పాటు లిటన్ దాస్ (1), అబు జయెద్ (3)లను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా, సౌతీ బౌలింగ్‌లో మహ్ముదుల్లా, ఎబదత్ హొస్సేన్ (0) ఔటయ్యారు. మరో రోజు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్‌తో సరిపెట్టుకున్న పేసర్ బౌల్ట్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌతీ 3, వాగ్నర్ 2 వికెట్లు తీశారు. డబుల్ సెంచరీ సాధించిన కివీస్ సారథి విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్టు ఈ నెల 8 నుంచి వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment