వన్డేల్లో జట్టు స్కోరు 500 పరుగులు... ఒకప్పుడు ఊహకు కూడా అందని విషయమిది. దీనిని న్యూజిలాండ్ మహిళల జట్టు దాదాపుగా చేసి చూపించింది. 500 పరుగుల మైలురాయిని చేరలేకపోయినా అతి చేరువగా వచ్చి కొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. కివీ బ్యాట్స్‌మన్ జోరుకు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 490 పరుగులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు కాగా... పురుషుల వన్డేల్లో అత్యధిక స్కోరు 444 (ఇంగ్లండ్) పరుగులు మాత్రమే కావడం విశేషం. అనంతరం ఐర్లాండ్ 144 పరుగులు మాత్రమే చేసి 346 పరుగులతో చిత్తుగా ఓడింది.
డబ్లిన్: మహిళల వన్డే క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐర్లాండ్‌తో శుక్రవారం ఇక్కడి వైఎంసీఏ గ్రౌండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. ఫలితంగా గతంలో తమ పేరిటే ఉన్న 455/5 పరుగుల (1997లో పాకిస్తాన్‌పై) అత్యధిక స్కోరు రికార్డును కివీస్ బద్దలు కొట్టింది. కివీస్ వీర విధ్వంసంలో ఇద్దరు సెంచరీలతో సత్తా చాటగా, మరో ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించారు. టాప్ ప్లేయర్, కెప్టెన్ సుజీ బేట్స్ (94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాడీ గ్రీన్ (77 బంతుల్లో 121; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు బాదారు. అమేలియా కేర్ (45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 64 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కాగా... ఐర్లాండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 33 పరుగులు సమర్పించుకుంది. ఆ తర్వాత ఐర్లాండ్ 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బేట్స్, వాట్కిన్ జట్టు ఇన్నింగ్స్‌ను సాధారణంగానే ప్రారంభించినా... ఆ తర్వాత దూకుడు పెంచారు. 40 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బేట్స్ ఆ తర్వాత చెలరేగి 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. 172 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత వాట్కిన్ అవుటైనా, ఆ తర్వాత వచ్చిన గ్రీన్ కూడా ఎక్కడా తగ్గలేదు. కారా ముర్రే ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన అనంతరం ఎట్టకేలకు అదే ఓవర్లో బేట్స్ వెనుదిరిగింది. అనంతరం 62 బంతుల్లోనే గ్రీన్ శతకం పూర్తయింది. 48 ఓవర్లో కెర్ 2 భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు 467 పరుగులకు చేరింది. చివరి 2 ఓవర్లలో 33 పరుగులు చేస్తే కివీస్ స్కోరు 500 పరుగులు చేరుతుందని భావించినా... 49వ ఓవర్లో 4, ఆఖరి ఓవర్లో 4 ఫోర్లు సహా 19 పరుగులు మాత్రమే వచ్చాయి. న్యూజిలాండ్ ధాటికి ఐర్లాండ్ బౌలర్లు కారా ముర్రే (119), గ్యాబీ లూయీస్ (92), లారా మారిట్జ్ (92), లౌజీ లిటిల్ (92), అమీ కెనలీ (81) భారీగా పరుగులు ఇచ్చారు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. మహిళల వన్డేల్లో రెండు సార్లు న్యూజిలాండ్ 400 పరుగులు దాటగా, ఆస్ట్రేలియా మాత్రమే ఒక సారి (412/3) ఈ ఘనత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment