తొలి మ్యాచ్ సచిన్ జట్టుతో
తమిళ్ తలైవాస్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ షెడ్యూల్ విడుదల
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. జూలై 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ మొత్తం 12 నగరాలలో జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా రాహుల్ చౌదరీ సారథ్యంలోని తెలుగు టైటాన్స్ జట్టు (హైదరాబాద్ ఫ్రాంచైజీ), సచిన్ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ (చెన్నై ఫ్రాంచైజీ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. ఈ సీజన్‌లో పాల్గొనే మొత్తం 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌లో ఉండే ఆరు జట్లు తమ జోన్ పరిధిలో 15 మ్యాచ్‌లు, అంతర్ జోన్ పరిధిలో 7 మ్యాచ్‌ల్లో తలపడతాయి.
ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌లో 3 క్వాలిఫయర్స్, 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ముంబై, చెన్నై వేదికగా జరుగుతాయి. ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుంది. షెడ్యూల్ విడుదల సందర్భంగా వివో ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ... పీకేఎల్– 5 సీజన్‌ను అత్యంత ప్రభావవంతమైన టోర్నీగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా జరిగే ఈ సీజన్ కబడ్డీ క్రీడాభిమానులకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. భారత్‌లో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సీఈఓ దేవ్‌రాజ్ చతుర్వేది పేర్కొన్నారు.