Tamil Talais
-
యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మ్యాచ్ ‘డ్రా’
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
పుణే: ప్రారంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకున్న తెలుగు టైటాన్స్... తమిళ్ తలైవాస్ చేతిలో ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా రెండు జట్ల మధ్య సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 31–25 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున మన్జీత్ ఛిల్లర్, అజయ్ ఠాకూర్ ఏడేసి పాయింట్లతో మెరిశారు. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37–27తో యూపీ యోధాను ఓడించింది. లీగ్‌కు మంగళవారం విరామం. బుధవారం హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
టెటాన్స్కు తలైవాస్ దెబ్బ
అహ్మదాబాద్: రైడింగ్‌లో రాహుల్ చౌదరి (8 పాయింట్లు) విజృంభించినా... రక్షణ శ్రేణి లోపాలతో ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో తొలిసారిగా తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. ఆరో సీజన్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 27–23 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో మన్జీత్ చిల్లర్ (3 పాయింట్లు) మెరిశారు. ఐదో నిమిషంలో ఇరు జట్లు 4–4తో సమంగా ఉన్నా, అద్భుత ట్యాక్లింగ్‌తో 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. తొలి భాగం ముగిసేసరికి తలైవాస్ 13–6తో నిలిచింది. రెండో భాగంలో పుంజుకొన్న టైటాన్స్... ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 29–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరేట్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఆడతాయి. -
బెంగళూరు బుల్స్ చేతిలో తమిళ్ తలైవాస్ ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. జోన్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 35–44తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓటమి పాలైంది. తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ (9 రైడ్ పాయింట్లు) పోరాడినా... అతనికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మరో ఓటమి తప్పలేదు. బెంగళూరు తరఫున పవన్ 16, కాశీలింగ్ 12 పాయింట్లతో చెలరేగారు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 42–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. -
తలైవాస్‌కు ఊరట
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరు వరుస పరాజయాల తర్వాత తమిళ్ తలైవాస్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35తో యు ముంబాపై గెలుపొందింది.మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 34–35తో దబాంగ్ ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. -
తలైవాస్‌ను గెలిపించిన అజయ్
న్యూఢిల్లీ: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 33–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. చివరి నిమిషంలో అజయ్ ఠాకూర్ సూపర్ రైడింగ్‌తో తలైవాస్ పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఆట ఆఖరి రైడ్‌కు ముందు బెంగాల్ 32–31తో స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్ ఠాకూర్ రెండు పాయింట్లు తెచ్చిపెట్టడంతో విజయం ఖాయమైంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 18–15తో ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ రెండో అర్ధభాగంలోనూ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే చివరి 10 నిమిషాల్లో బెంగాల్ రైడర్లు పాయింట్లు సాధించడంతో పోటీ రసవత్తరంగా మారింది. తలైవాస్ తరఫున అజయ్ (8), అరుణ్ (8), తివకరణ్ (5) రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో మణిందర్ సింగ్ (13) ఆకట్టుకున్నాడు. సుర్జీత్ సింగ్ 5, దీపక్ నర్వాల్, జంగ్ కున్ లి చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42–24తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లకు విరామం. -
తలైవాస్‌ను గట్టెక్కించిన అజయ్
ప్రొ కబడ్డీ లీగ్ సోనెపట్: ఆట ముగిసేందుకు ఇక నిమిషమే మిగిలుంది. తమిళ్ తలైవాస్ 30–31 స్కోరుతో వెనుకబడింది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్ ఠాకూర్ సూపర్ రైడ్‌తో ఆధిక్యం 33–31తో తారుమారైంది. ఇంకొన్ని క్షణాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో చివరకు తమిళ్ తలైవాస్ 34–33తో యూపీ యోధపై గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 12–18తో ఓటమి ఖాయమనుకున్న తలైవాస్ జట్టు రెండో అర్ధభాగంలో అసాధారణ స్థాయిలో చెలరేగింది. రైడర్లు, డిఫెండర్లు శ్రమించి జట్టును గెలిపించారు. అజయ్ ఠాకూర్, ప్రపంజన్ చెరో 8 పాయింట్లు సాధించగా, టాకిల్‌లో అమిత్ హుడా 4, వినీత్ కుమార్ 3 పాయింట్లు చేశారు. యూపీ యోధ తరఫున రైడర్ నితిన్ తోమర్ అద్భుతంగా పోరాడాడు. 19 సార్లు రైడింగ్‌కు వెళ్లిన నితిన్ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. రిషాంక్ దేవడిగా 8 పాయింట్లు చేయగా... డిఫెండర్ నితీశ్ కుమార్ (5) టాకిల్‌లో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 38–22 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. పుణేరి తరఫున దీపక్ హుడా 13, సందీప్ నర్వాల్ 8 పాయింట్లు చేయగా, రాజేశ్, మోను, రవి కుమార్, గిరీశ్ తలా 2 పాయింట్లు సాధించారు. హరియాణా జట్టులో దీపక్ కుమార్ దహియా (11) రాణించాడు. మిగిలిన వారిలో వజీర్ సింగ్ 3, సురేందర్ నడా, మోహిత్ చిల్లర్, జీవ గోపాల్ తలా 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది. -
తలైవాస్‌పై పట్నా పైచేయి
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 35–24తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే పట్నా ఆటగాళ్లకు తలైవాస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మోను 11, అజయ్ ఠాకూర్ 10 రైడింగ్ పాయింట్లతో విజయంలో కీలకంగా నిలిచారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 26–24 తేడాతో యు ముంబాపై గెలిచింది. -
మళ్లీ ఓడిన తమిళ్ తలైవాస్
నాగ్‌పూర్: క్రికెట్ దిగ్గజం సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం నాగ్‌పూర్ అంచె పోటీలు ప్రారంభం కాగా... జోన్–బిలో జరిగిన తొలి మ్యాచ్‌లో తలైవాస్ 31–32 స్కోరుతో బెంగళూరు బుల్స్ చేతిలో ఒక పాయింట్ తేడాతో పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌లోనూ ఓడిన తమిళ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి. అనంతరం జరిగిన జోన్ ‘ఎ’ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 26–21 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ... బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి. ఈ పోటీలను ‘స్టార్ స్పోర్ట్స్–2’ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
తొలి మ్యాచ్ సచిన్ జట్టుతో
తమిళ్ తలైవాస్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ షెడ్యూల్ విడుదల ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. జూలై 28న ప్రారంభమయ్యే ఈ టోర్నీ మొత్తం 12 నగరాలలో జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా రాహుల్ చౌదరీ సారథ్యంలోని తెలుగు టైటాన్స్ జట్టు (హైదరాబాద్ ఫ్రాంచైజీ), సచిన్ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ (చెన్నై ఫ్రాంచైజీ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. ఈ సీజన్లో పాల్గొనే మొత్తం 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్లో ఉండే ఆరు జట్లు తమ జోన్ పరిధిలో 15 మ్యాచ్‌లు, అంతర్ జోన్ పరిధిలో 7 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌లో 3 క్వాలిఫయర్స్, 2 ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ముంబై, చెన్నై వేదికగా జరుగుతాయి. ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యమిస్తుంది. షెడ్యూల్ విడుదల సందర్భంగా వివో ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ... పీకేఎల్– 5 సీజన్‌ను అత్యంత ప్రభావవంతమైన టోర్నీగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. సుదీర్ఘంగా జరిగే ఈ సీజన్ కబడ్డీ క్రీడాభిమానులకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. భారత్‌లో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సీఈఓ దేవ్‌రాజ్ చతుర్వేది పేర్కొన్నారు.