
న్యూఢిల్లీ: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 33–32తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. చివరి నిమిషంలో అజయ్ ఠాకూర్ సూపర్ రైడింగ్‌తో తలైవాస్ పాయింట్ తేడాతో గట్టెక్కింది. ఆట ఆఖరి రైడ్‌కు ముందు బెంగాల్ 32–31తో స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈ దశలో కూతకు వెళ్లిన అజయ్ ఠాకూర్ రెండు పాయింట్లు తెచ్చిపెట్టడంతో విజయం ఖాయమైంది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 18–15తో ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ రెండో అర్ధభాగంలోనూ ఆధిపత్యాన్ని చాటుకుంది.
అయితే చివరి 10 నిమిషాల్లో బెంగాల్ రైడర్లు పాయింట్లు సాధించడంతో పోటీ రసవత్తరంగా మారింది. తలైవాస్ తరఫున అజయ్ (8), అరుణ్ (8), తివకరణ్ (5) రాణించారు. బెంగాల్ వారియర్స్ జట్టులో మణిందర్ సింగ్ (13) ఆకట్టుకున్నాడు. సుర్జీత్ సింగ్ 5, దీపక్ నర్వాల్, జంగ్ కున్ లి చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42–24తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లకు విరామం.