
అహ్మదాబాద్: రైడింగ్‌లో రాహుల్ చౌదరి (8 పాయింట్లు) విజృంభించినా... రక్షణ శ్రేణి లోపాలతో ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో తొలిసారిగా తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. ఆరో సీజన్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 27–23 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో మన్‌జీత్ చిల్లర్ (3 పాయింట్లు) మెరిశారు.
ఐదో నిమిషంలో ఇరు జట్లు 4–4తో సమంగా ఉన్నా, అద్భుత ట్యాక్లింగ్‌తో 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. తొలి భాగం ముగిసేసరికి తలైవాస్ 13–6తో నిలిచింది. రెండో భాగంలో పుంజుకొన్న టైటాన్స్... ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 29–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరేట్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఆడతాయి.