
ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు.
చెస్టర్ లీ స్ట్రీట్ : మొన్నటివరకు ఎవరికీ తెలియని నికోలస్ పూరన్.. ఒక్క ఇన్నింగ్స్‌తో హీరో అయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో కరేబియన్ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. నికోలస్ పట్టువదలని విక్రమార్కుడిలా శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించినంత పనిచేశాడు. అయితే చివర్లో లంక బౌలర్లు రాణించడంతో ప్రపంచకప్‌లో విండీస్ వరుసగా ఆరో ఓటమి చవిచూసింది. అయితే నికోలస్ ఒంటరి పోరాటానికి విండీస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెటిజన్లు ఇప్పుడే అతడిని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారాతో పోల్చుతున్నారు.
కాగా, ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో కరేబియన్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారని భావించినా అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే గెలుపుకంటే ఓటమితో ఎన్నో నేర్చుకుంటామని శతక వీరుడు నికోలస్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో జరగబోయే సిరీస్‌లో తమ ప్రతాపాన్ని చూపుతామని నికోలస్ పేర్కొన్నాడు. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను ఆ సిరీస్‌లో పునరావృతం చేయబోమని, విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. (చదవండి: 8 నెలల తర్వాత బౌలింగ్.. తొలి బంతికే.!)
‘ప్రపంచకప్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక) గెలుపు చివరంచున బోల్తా పడ్డాము. ప్రస్తుతం జట్టులో చాలా మంది యువకులమే ఉన్నాము. ఈ టోర్నీతో చాలా నేర్చుకున్నాము. ఇక నా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడే నన్ను ఒకరితో(బ్రయాన్ లారా) పోల్చడం తగదు. టీమిండియాతో త్వరలో జరగబోయే సిరీస్‌పై దృష్టి పెడతాం. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను టీమిండియా సిరీస్‌లో పునరావృతం చేయబోము. విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం. దానికి తొలి అడుగు ఈ సిరీస్‌తోనే మొదలెడతాం’అంటూ నికోలస్ వ్యాఖ్యానించాడు.