కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగిన యువ టీమిండియా... ‘నిదహస్’ ట్రోఫీని ఒడిసి పట్టేందుకు మరొక్క విజయం చాలు. అనవసర ఒత్తిడికి గురికాకుండా మన ఆట మనం ఆడుకుంటే ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించడం ఏమంత పెద్ద కష్టం కాదు. లీగ్ దశలో ఇదే జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ బృందం ఆత్మవిశ్వాసం తోడుగా చెలరేగితే సగర్వంగా టైటిల్ అందుకోవడం ఖాయం. అయితే ఆతిథ్య శ్రీలంకపై రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ సూపర్ ఛేజింగ్ చేసిన బంగ్లాదేశ్ అంతిమ సమరంలో అద్భుతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టైటిల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.
కొలంబో: టోర్నీ ప్రారంభంలో ఇరు జట్లు తడబడ్డాయి. ఇటు తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత ఘనంగా పుంజుకుంది. అటు బంగ్లాదేశ్ క్రమక్రమంగా ఆటతీరు మెరుగుపర్చుకుంటూ వచ్చింది. స్థాయికి తగ్గ ఆటతో రోహిత్ సేన, పోరాటపటిమతో షకీబ్ బృందం నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్ చేరాయి. శక్తిసామర్థ్యాలు, గత రికార్డు చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తున్నా, సంచలనాల ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లలో లోతైన బ్యాటింగ్ లైనప్, ఆల్ రౌండర్లు, నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఆదివారం జరుగనున్న తుది సమరం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
టీమిండియాకు ‘ఒక్క’ లోటు...
మొన్నటివరకు కెప్టెన్ రోహిత్‌శర్మ ఫామ్ భారత్‌కు పెద్ద ఆందోళనగా ఉండేది. ఎట్టకేలకు గత మ్యాచ్‌లో బంగ్లాపైనే అతడు టచ్‌లోకి వచ్చి బెంగతీర్చాడు. ఓపెనర్ ధావన్ సహా రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ అందరూ ఈ టోర్నీలో సత్తాచాటారు. దీంతో బ్యాటింగ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్లూ తీస్తున్నాడు. చహల్ గాడిన పడ్డాడు.
అయితే... ఉనాద్కట్, సిరాజ్ ఇద్దరూ విఫలమవడంతో రెండో ప్రధాన పేసర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఉన్నందున సిరాజ్ స్థానంలో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగితే 200పైగా పరుగులు సాధించి ప్రత్యర్థిని మానసికంగా ఒత్తిడిలోకి నెట్టాలి. బౌలింగ్ చేయాల్సి వచ్చినా 160లోపు కట్టడి చేస్తే ఛేదనలో ఇబ్బందులు ఎదురవవు.
బంగ్లాతో పారాహుషార్...
భారత్ స్థాయిలో ఆటగాళ్లు లేకున్నా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆతిథ్య శ్రీలంకపై రెండు మ్యాచ్‌ల్లోనూ వారి పోరాటం విస్మరించలేనిది. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్‌లకు తోడు కెప్టెన్ షకీబుల్ హసన్ రాకతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. సారథ్య బాధ్యతల ఒత్తిడి లేకపోవడంతో గత మ్యాచ్‌లో మహ్ముదుల్లా అద్వితీయంగా ఆడాడు. ముస్తఫిజుర్, రూబెల్ పదునైన పేసర్లు. స్పిన్‌లో మెహదీ హసన్‌కు షకీబ్ తోడయ్యాడు. వీరంతా సమష్టిగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బంగ్లా ఫైనల్‌కు బరిలో దించే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్‌శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, పాండే, కార్తీక్, విజయ్‌శంకర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, దీపక్ హుడా/అక్షర్ పటేల్/సిరాజ్.
బంగ్లాదేశ్: షకీబుల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్లా, షబ్బీర్, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్, నజ్ముల్ ఇస్లాం.
పిచ్, వాతావరణం
మరోసారి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాత్రి వేళలో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం లేదు.
రాత్రి గం.7 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
‘శ్రీలంకతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టి20ల్లో ఉండాల్సిన నాటకీయత, ఉద్వేగాలు అన్నీ కనిపించాయి. విజేతగా నిలిచినందుకు మేం అదృష్టవంతులం. స్ట్రైక్ రొటేట్ చేసి మహ్ముదుల్లాకు బ్యాటింగ్ వచ్చేలా చూడాలనుకున్నా. ఫైనల్లో భారత్ కఠిన ప్రత్యర్థే. కానీ మా జోరు కొనసాగిస్తాం.’ –బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్
7 భారత్, బంగ్లాదేశ్ జట్లు టి20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 7 సార్లు తలపడ్డాయి. ఏడింటిలోనూ భారత్‌నే విజయం వరించింది.
షకీబ్, నూరుల్ మ్యాచ్ ఫీజులో కోత
కొలంబో: శ్రీలంకతో శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్... క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించాడని పేర్కొంటూ అతడి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 25 శాతం కోత విధించి, ఒక డి మెరిట్ పాయింట్ ఇచ్చింది. దీంతోపాటు మ్యాచ్‌కు అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించినందుకు బంగ్లాదేశ్ సబ్‌స్టిట్యూట్ నూరుల్ హసన్ మ్యాచ్ ఫీజులోనూ 25 శాతం కోత పెడుతూ, ఒక డి మెరిట్ పాయింట్ కేటాయించింది.
శనివారం ఈ ఆటగాళ్లిద్దరూ ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలేమీ లేకుండానే వారిపై నిర్ణయం తీసుకున్నారు. ‘మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉన్నా శుక్రవారం ఘటన ఏ స్థాయి క్రికెట్‌లోనూ సహించరానిది. షకీబ్‌ను నాలుగో అంపైర్ అదుపు చేయలేకపోయినా, ఫీల్డ్ అంపైర్లు నూరుల్–తిసారా మధ్య కలుగజేసుకోకపోయినా పరిస్థితులు దారుణంగా మారేవి. ఈ ఇద్దరు ఆటగాళ్లు పరిధిని అతిక్రమించారు’ అని క్రిస్ బ్రాడ్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment