గప్టిల్.. అంత ఈజీ కాదు: కుంబ్లే
కోల్ కతా: ఇప్పటికే ఒక టెస్టులో ఓటమితో మూడు మ్యాచ్ ల సిరీస్ లో వెనుకబడిపోయిన న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మైండ్ గేమ్ ను మొదలు పెట్టేశాడు. ప్రధానంగా కివీస్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ను లక్ష్యంగా చేసుకుని అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన గప్టిల్ కు ఇక్కడ పరిస్థితుల్లో ఆడాలంటే అంత ఈజీ కాదంటూ వ్యాఖ్యానించాడు.'గప్టిల్ ఒక నాణ్యమైన ఆటగాడు. అంతే కాదు భారీ షాట్లు కొట్టగల సమర్ధుడు. అయితే ప్రస్తుతం ఫామ్ లేని గప్టిల్ సత్తా చాటుకోవాలంటే ఇక్కడ అంత ఈజీ కాదు. నీ దూకుడు ఇక్కడ పని చేయదు 'అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.
గత మ్యాచ్ లో కొనసాగించిన ఆట తీరునే రెండో టెస్టులో కూడా కొనసాగిస్తామని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ప్రత్యర్థి జట్టుకు అత్యంత కీలకమని, వారి ఓపెనర్లను ముందుగా పెవిలియన్ కు పంపి ఒత్తిడి తెస్తామన్నాడు. మరోవైపు మార్క్ క్రెయిగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జీతన్ పటేల్ ను కుంబ్లే ప్రశంసించాడు. గత కొంతకాలంగా జీతన్ ఆట తీరు ఆకట్టుకుందన్నాడు. రెండో టెస్టులో ఆడబోతున్న జీతన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు కుంబ్లే పేర్కొన్నాడు.