ధోని బ్యాటింగ్ ఆర్డర్పై కుంబ్లే సమాధానం
న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత ముందుకు తీసుకొస్తే బాగుంటుందని గత కొంతకాలంగా వినిపిస్తున్న కామెంట్లకు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే సమాధానమిచ్చాడు. ప్రధానంగా ధోని క్రీజ్లో కుదురుకోవడానికి సమయం పడుతుందనే వాదనను కుంబ్లే తోసిపుచ్చాడు. ధోని క్రీజ్ లో కుదురుకునే క్రమంలో అతనికి ఎటువంటి సమయం తీసుకోవడం లేదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ లో విశేష అనుభవమే కాకుండా, కచ్చితమైన మ్యాచ్ ఫినిషర్గా పేరున్న ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చాల్సిన అవసరం లేదని కుంబ్లే స్పష్టం చేశాడు.
దాంతో పాటు టీమిండియా బ్యాటింగ్ బలంగా మెరుగ్గా ఉండటంతో వారి ఆర్డర్ ను అక్కడ ఉన్న పరిస్థితుల్నే బట్టే జరుగుతుందన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో మనీష్ పాండే నాల్గో స్థానంలో చక్కగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. సుదీర్ఘమైన దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న మనీష్ కు నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఒత్తిడిని జయించిన మ్యాచ్ లు అనేకమన్నాడు. ప్రస్తుతం ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్లు గాయాల బారిన పడటంతో ఆ అవకాశం అజింక్యా రహానే దక్కిందన్నాడు. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో రహానే ఓపెనర్ గానే బరిలోకి దిగుతాడని కుంబ్లే పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నాటికి రహానే ఓపెనర్ గా దిగుతుడా?లేదా? అనేది అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉంటుందని చీఫ్ కోచ్ స్పష్టం చేశాడు.